సెల్ఫ్ క్వారంటైన్ పాటించనందుకు రూ.24 లక్షలు జరిమానా..

 సెల్ఫ్ క్వారంటైన్ పాటించనందుకు రూ.24 లక్షలు జరిమానా..

 

కోవిడ్ 19 ప్రపంచంలో సుమారు 3,80,000 మందికి సోకింది. 16 వేల మందిని పొట్టన బెట్టుకుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలు కనీస నియమాలు పాటించకపోవడం పాలకులకు సవాలుగా మారింది. జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో యువత ‘కరోనా’ పార్టీలు చేసుకుంటున్నారు. 

లాక్‌డౌన్, క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించవద్దు. అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యమంటూ ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా.. ఎవరూ మాట వినడం లేదు. మేం చాలా స్ట్రాంగ్ అన్నట్లుగా బైకులేసుకుని ఊర్ల మీద పడుతున్నారు. ఇండియా వీరిని మందలించి ఇంటికి పంపేస్తున్నారు. కానీ, కొన్ని దేశాలు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాయి. 

హువాంగ్ అనే 35 ఏళ్ల వ్యక్తి సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా ఓ క్లబ్‌లో డ్యాన్స్ చేస్తున్నందుకు తైవాన్ అధికారులు రూ.24 లక్షలు జరిమానా విధించారు. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు తైవాన్ ‘ఎం పోలీస్’ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తోంది. వైద్యులు హువాంగ్‌ను 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అతడి వివరాలను పోలీసులకు ఇచ్చారు. 

అయితే, అతడు ఇంట్లో ఉండకుండా ఓమ్నీ నైట్ క్లబ్‌కు వెళ్లి స్నేహితులతో డాన్స్‌లు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జరిమానా విధించారు. తైవాన్‌లో ఇప్పటివరకు 195 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఈ దేశం సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. విదేశీయులకు అనుమతులు నిరాకరించింది.