ఒక్క సిగ‌రెట్ తో ముగ్గురికి క‌రోనా..

ఒక్క సిగ‌రెట్ తో ముగ్గురికి క‌రోనా..

 

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ డెంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసులు చిత్ర విచిత్ర‌మైన లింకుల ద్వారా వ్యాపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఒక్క సిగ‌రెట్ తో  ముగ్గురికి క‌రోనా సోకిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది.
 
వివ‌రాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు హైదరాబాద్ జియాగూడలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడ ఆ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి షాద్‌నగర్ వెళ్లాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సిగరెట్ తాగాడు.. ముగ్గురు ఇలా సిగరెట్ షేర్ చేసుకున్నారు.

అయితే కొద్ది రోజుల క్రితం  షాద్‌నగర్ ‌లోని యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఆ త‌రువాత అత‌ను కాంటా‌క్ట్ అయిన వ్య‌క్తుల‌కు క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌గా, తాజాగా  ఆ వ్య‌క్తి సిగ‌రెట్ షేర్ చేసుకున్న మ‌రో ఇద్ద‌రి స్నేహితుల‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లుగా వెల్ల‌డైంది.
  
అయితే ఈ కేసులంతా జియాగూడ లింకుల ద్వారానే వ్యాపించిన‌ట్లు తేలింది. దీంతో తాజా కేసుల‌తో షాద్‌నగర్‌లో మొత్తం కేసులు ఏడుకు చేరాయి. షాద్ న‌గ‌ర్ లో కేసుల సంఖ్య పెరగడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో షాద్‌నగర్ ప్రాంతంలో శానిటైజేషన్ చేపట్టిన అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు.