సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు చేసిన అదితీ సింగ్

సొంత పార్టీపైనే విమ‌ర్శ‌లు చేసిన అదితీ సింగ్

 

వ‌ల‌స కార్మికులపై కాంగ్రెస్ పార్టీ క‌ల్లబొల్లి ప్రేమ క‌న‌ప‌రిచింది త‌ప్ప వాస్త‌వానికి వారిని ఆదుకోవ‌డానికి పార్టీ ముందుకు రాలేదంటూ సొంత‌పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లోకి ఎక్కారు రాయ‌బ‌రేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితిసింగ్‌. విపత్తు సమయాల్లో దిగజారుడు రాజకీయాలు చేయ‌డం స‌రికాదంటూ  సొంత పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేసిన  ఎమ్మెల్యే అదితి సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్య‌లు తీసుకుంది.

ఆమెను పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బుధవారంనాడు సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ముందు అదితిపై చేసిన ఫిర్యాదు కూడా పెండింగ్‌లోనే ఉంది. ఆమె ఎమ్మెల్యే హోదాను రద్దు చేయాలని పార్టీ కోరింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆమె కలుసుకోవడం, పార్టీ అభీష్టానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశానికి హాజరవడం చేసిన సమయంలోనే ఆమె విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ వర్గాలు తాజాగా తెలిపాయి. 

కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ ఇన్‌చార్జ్ గా అదితి సింగ్ ఉన్నారు. కాగా.. తాజాగా ఆమె మరోసారి పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీకి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బస్సుల్లో చాలా మటుకు చిన్న వాహనాలే ఉన్నాయని, కొన్నిటికి రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా లేవని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ వద్ద బస్సులే ఉంటే పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. యూపీకి చెందిన పిల్లలు రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకుపోయినప్పుడు ఆ బస్సులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇంతటితో ఆగకుండా వలస కార్మికులను బస్సుల్లో స్వస్థలాలకు తీసుకురావడానికి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అదితి సింగ్‌పై తక్షణ క్రమశిక్షణా చర్యలకు దిగింది.