కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో వైయస్.జగన్ భేటీ

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో వైయస్.జగన్ భేటీ

న్యూఢిల్లీ : 

కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షాతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై హోంమంత్రికి నివేదించిన సీఎం

విజ్ఞాపన పత్రంలోని  అంశాలను హోంమంత్రికి వివరించిన సీఎం వైయస్.జగన్

పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదా చేశాం. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోంది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. దీనికోసం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు రివైజ్డ్‌ అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించింది.
దీనికి సంబంధించిన పరిపాలనపరమైన అనుమతి ఇప్పించేందుకు జోక్యం చేసుకుని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా సీఎం కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 3,320 కోట్లు కేంద్రంనుంచి రావాల్సి ఉంది. ఆ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కేంద్ర జలవనరులశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసారు.

             ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల రూపేణా, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ.10,610 కోట్లు మాత్రమే ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఒక ఏడాది  విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమే. పెండింగులో ఉన్న గ్రాంట్లను విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. వెనకబడ్డ జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకూ రూ.1050 కోట్లు మాత్రమే వచ్చాయి. గడిచిన మూడేళ్లనుంచి దీనికి సంబంధించిన ఎలాంటి నిధులు రాలేదన్న విషయాన్ని హోంమంత్రి ముందు సీఎం ఉంచారు. ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి సగటున రూ.4000 ఇస్తే, ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాల్లో కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనకబడ్డ జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్‌ ఖండ్‌ తరహాలో విస్తరించాలని హోంమంత్రిని సీఎం కోరారు.

             రెవిన్యూ లోటును భర్తీచేస్తామంటూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీన్ని పార్లమెంటు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014–15 నాటికి ఈ రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్‌ నిర్ధారించింది. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. దీన్ని ఇప్పించాల్సిందిగా హోంమంత్రిని సీఎం కోరారు. 
రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన డబ్బును విడుదల చేయాల్సిందిగా హోంమంత్రిని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో ప్రస్తావిస్తూ... ‘‘  కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకొస్తూ, దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని సీఎం కోరారు. 

             రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రికి సీఎం తెలిపారు. దీనికోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రణాళిక వేసుకున్నామని, ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని హోంమంత్రికి  ముఖ్యమంత్రి తెలిపారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సీఎం తెలిపారు. హైకోర్టు కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అమిత్‌షాను సీఎం కోరారు. 
రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని హోంమంత్రికి సీఎం తెలిపారు. 

              శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపనపత్రంలో సీఎం పేర్కొన్నారు. గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోందని సీఎం అన్నారు. 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి అపహాస్యం చేసిందన్న సీఎం. ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందని సీఎం తెలిపారు. తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేసారు.

               మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు చరిత్రాత్మక చర్యలను తీసుకున్నామని హోంమంత్రికి  సీఎం వివరించారు. విచారణను వేగంగా పూర్తిచేసి, నిర్దేశిత సమయంలోగా విచారణ చేసి శిక్షలు విధించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం, ఒన్‌ స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని, సరిపడా సిబ్బందితో వీటిని బలోపేతం చేశామని సీఎం వెల్లడించారు. ఏపీ దిశా చట్టానికి ఆమోదం తెలిపాల్సిందిగా సీఎం కోరారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికోసం కడప స్టీల్‌ పాంట్, రామాయపట్నం పోర్టు, విశాఖపట్నం– చెన్నై కారిడర్, కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో సాగునీటి వసతి మెరుగుపరచడానికి గోదావరి నదిలో నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలంకు తరలించే ప్రాజెక్టుకూ తగిన ఆర్థిక సహాయం చేయాలని సీఎం కోరారు.  ఆమేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. 

            పోలీసు వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్‌లోని ఉండిపోయాయని, ఈ విషయంలో ఏపీ పోలీసు విభాగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని హోంమంత్రికి సీఎం తెలిపారు. నిధులలేమి, సిబ్బంది కొరత వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని, అవసరాలకు అనుగుణంగా పోలీసు విభాగం సమర్థతను పెంచేలా సహాయం చేయాల్సిందిగా సీఎం కోరారు. 
ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రాజెక్టును హోంమంత్రిత్వ శాఖ 2017లో ఆమోదించిందని, ఇందులో రూ.152 కోట్లు కేంద్రం ఇవ్వాలని, రూ. 101.4 కోట్లు రాష్ట్రం భరించాలని నిర్ణయించగా, రాష్ట్రంలో గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు మూతపడిన విషయాన్ని హోంమంత్రికి సీఎం వివ‌రించారు.
 
             స్టేట్‌ ఆపరేషనల్‌ కమాండ్, కంట్రోల్‌ సెంటర్, సెంట్రలైజ్డ్‌ డేటా సెంటర్, ఏపీ పోలీస్‌ అకాడమీ ఏర్పాటుకు తగిన సహాయం చేయాల్సిందిగా సీఎం కోరారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజల భద్రతకోసం గట్టి చర్యలను తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతం కేడర్‌ స్ట్రెంత్‌ను 79 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 96 కు పెంచాలంటూ సీఎం కోరారు.