హైదరాబాద్ లో మరో ప్రేమ జంట పై హత్యయత్నం..!!

0
259
hyderabad murder attempt

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ పరువు హత్యఘటనను మరువక ముందే హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై దారుణంగా దాడి జరిగింది. పది రోజుల క్రితమే ఈ జంటపై యువతి తండ్రి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌(24), బోరబండ వినాయక్‌రావు నగర్‌కు చెందిన మాధవి(22) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అమ్మాయికి తన మేనబావతో వివాహం చేయాలని నిశ్చియించడంతో మాధవి కొన్ని రోజుల క్రితం సందీప్‌ ఇంటికి వచ్చింది. పది రోజుల కిందట అల్వాల్‌లోని ఓ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా పోలీసులు నచ్చజెప్పడంతో తర్వాత ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య సమోధ్య కుదిరింది. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మాధవి తండ్రి రెండు రోజులుగా ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు. బుధవారం సందీప్‌, మాధవిలకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు రమ్మని పిలిచాడు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడికి వచ్చిన వారిపై అందరూ చూస్తుండగానే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మాధవికి మెడ, చేతులపై తీవ్ర గాయాలు కాగా, సందీప్‌కి ముఖం నుంచి దవడ వరకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మాధవి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.