ఏపీలో ఆర్డినెన్స్ జారీ చేస్తారా?

 ఏపీలో ఆర్డినెన్స్ జారీ చేస్తారా?

అందరూ ఊహించిందే జరిగేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అభివృద్ధి వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌లు జారీచేసేలా ఉంది.  ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సభలు ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు అందువల్ల మళ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేవరకూ... ఆ రెండు కీలక బిల్లులకూ మోక్షం ఉండదు. అందువల్ల అప్పటివరకూ ఎదురుచూడటం టైమ్ వేస్ట్ అని భావిస్తున్న ప్రభుత్వం... ఆర్డినెన్స్ వైపు అడుగులు వేస్తోంది. మరి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగలదా? సెలెక్ట్ కమిటీకి పంపుతున్న బిల్లులపై ఆర్డినెన్స్ జారీ చేసే ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ జరుగుతోంది. 

ఏపీలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించి శాసనమండలికి పంపింది. అయితే ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవటం, ఆపై ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించటం చకచకా జరిగిపోయాయి. అయితే తాజా పరిణామాలతో మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు మండలి రద్దుకు ఇంకా రెండేళ్ల వ్యవధి పడుతుందనే ప్రచారం జరుగుతోంది. వీటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 

ఒక వేళ మండలి రద్దుకు వ్యవధి పట్టినప్పటికీ మరో నెల రోజుల్లోపే తుది నిర్ణయం తీసుకోవటం ద్వారా మూడు రాజధానులపై ముందుకు వెళ్లాలనే యోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇందులో భాగంగా శాసనసభ, మండలి ప్రోరోగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రోరోగ్ వల్ల టెక్నికల్ గా ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రెండు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే ప్రభుత్వం ఉభయ సభల ప్రోరోగ్‌కు సిఫార్సు చేసిందని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సెలక్ట్ కమిటీ ప్రతిపాదన చట్టబద్ధంగా చెల్లదని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై అవసరమైతే కోర్టులో గట్టిగా వాదించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఉగాది నాటికి రాజధాని తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని ముందుగా భావించినా బడ్జెట్ సమావేశాల తరువాత తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. జూన్ కల్లా విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో ఉద్యోగుల పరంగా నెల, రెండు నెలలు ముందుగానే తరలింపు ప్రక్రియ ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. . ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లుగా ప్రోరోగ్ అంశంలో సాంకేతిక ఇబ్బందులను కూడా పరిశీలిస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్, భూ సేకరణ చట్టం ఆర్టినెన్స్‌లు తెచ్చే సందర్భంలో కూడా పార్లమెంటును ప్రోరోగ్ చేశారని అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. రాజ్యసభ సమావేశాలు నడుస్తుండగానే ప్రోరోగ్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. పార్లమెంట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలను పరిగణనలోకి తీసుకుని మూడు రాజధానులపై ఆర్డినెన్స్ జారీకి ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.

 ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలంటే సెలెక్ట్ కమిటీలో తేలిన తర్వాతే... ఆర్డినెన్స్ జారీ చేసేందుకు వీలవుతుందని వాదన ఉంది. ముందుగా ఆర్డినెన్స్‌లు జారీ చేసేసి... ఆ తర్వాత ఆరు నెలల్లో రెండు బిల్లులకూ ఆమోదం పొందేలా చేసుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఆరు నెలల్లో మండలి సమావేశం కాకపోతే... ఆర్డినెన్స్‌ని మరో ఆరు నెలలు పొడిగించుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. దీనిపై ప్రభుత్వం లోతుగా చర్చిస్తోంది. సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులపై ఆర్డినెన్స్ జారీ చేయవచ్చా లేదా అన్నదానిపై న్యాయపరమైన చిక్కుల్ని పరిశీలిస్తోంది.

మరోవైపు అమరావతిపై సీఆర్డీఏ చట్టాన్నిరద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మండలిలో దీనికి బ్రేకు పడింది. జనవరిలో రెండు రోజుల చర్చ తర్వాత ఆయా బిల్లుల పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలించేందుకు సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ లెజిస్లేచర్ కార్యదర్శి  తిప్పికొట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న ఛైర్మన్ ఆదేశాన్ని బ్యూరోక్రసీలో భాగమైన కార్యదర్శి తిరస్కరించగలరా? అన్నదే సందేహం.

మొత్తానికి ప్రభుత్వం మండలి ఆమోదం, సెలక్ట్ కమిటీతో నిమిత్తం లేకుండా రాజధాని బిల్లులను గవర్నర్ కు పంపి చట్టం చేయిస్తామని చెబుతోంది. బిల్లులు గవర్నర్ దగ్గరకు  వస్తే వాటిని ఆమోదించి గవర్నర్ చట్టంగా మారుస్తారా? లేక మండలిలో సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసి కాబట్టి పెండింగులో పెడతారా? మండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించిన కార్యదర్శిపై చర్యలకు తీసుకోమని ప్రభుత్వానికి సలహా ఇస్తారా?  వేచి చూడాల్సిందే...మొత్తంగా గవర్నర్ కోర్టులోకి బంతి చేరుతోంది.