తుఫాను బాధితులకు అండగా ఉంటా : చంద్రబాబు

0
193
chandra babu naidu

ప్రజాసేవ కోసమే తామున్నామనే భరోసా కలిగేలా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం నుంచి ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి మండలానికి ఒక సబ్ ‌కలెక్టర్ బాధ్యత తీసుకుని అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చటంతో పాటు రహదారుల మరమ్మతులు, కూలిన చెట్లను తొలగించే పనులను వేగవంతం చేయాలని సూచించారు. బాధిత ప్రజానీకానికి సేవలు అందించటంలో అధికారులు పోటీ పడాలని పేర్కొన్నారు.

మన కుటుంబాలకు ఆపద వస్తే ఎలా స్పందిస్తామో.. అదేవిధంగా సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుల పట్ల మెలగాలని కోరారు. సెల్‌ఫోన్‌ టవర్లకు మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వీస్‌ ప్రొవైడర్లు త్వరితగతిన స్పందించాలని కోరారు. ఆదివారం అధికారులెవరికీ సెలవు లేదని కావాలంటే తర్వాత సెలవు తీసుకోవచ్చని సూచించారు. తిత్లీతుఫాను కదలికపై పొరుగు రాష్ట్రం కన్నా మనమే సరిగ్గా అంచనా వేశామని తెలిపారు. తుఫాను ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టంగా గుర్తించగలిగామని… మన శాస్త్ర సాంకేతికతే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. సమీక్షలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.