ధైర్యంగా ఉండండి.. అంతా నేను చూసుకుంటా : సీఎం చంద్రబాబు

0
376
Chandrababu Naidu

శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తిత్లీ తుఫాను ఓ చీకటి అధ్యాయమే! జిల్లాలో అధిక ప్రాంతాలు ఆ ప్రకృతి విధ్వంసానికి గురయ్యాయి. కొన్ని గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులను వరద ముంచెత్తింది. శివారు పల్లెల్లో జనం ఎలా ఉన్నారో కూడా బాహ్య ప్రపంచానికి ఇప్పటికీ తెలియటం లేదు. ఎక్కడికక్కడ రోడ్లపై కుప్పకూలిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు కాళ్లకు అడ్డుపడుతున్నాయి. తినడానికి తిండి…తాగడానికి నీళ్లు కూడా అందని అభాగ్యులెందరో. జాతీయ రహదారిపై ప్రయాణాలకు మార్గం సుగమం చేసినా.. అంతర్గత మార్గాలు బాగా దెబ్బతిన్నాయి. సీఎం చంద్రబాబు జిల్లాలో ఉండి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండండి.. అంతా నే చూసుకుంటా. మీరు తేరుకునే దాకా నేనిక్కడే ఉంటా’ అని భరోసా ఇస్తున్నారు.

titli cycloneతుఫాను బాధితులు ధైర్యంగా ఉండాలని, అన్ని రకాల నష్ట నివారణ చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభావిత ప్రాంత ప్రజలకు గట్టి భరోసా ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా ప్రజలను బతికించుకునేందుకు ఏంచేయాలో అన్నీ చేస్తామన్నారు. తక్షణమే ప్రజలకు అందాల్సిన సహాయక చర్యలపై దృష్టిసారిస్తున్నామని, ముందుగా ప్రాణనష్టాన్ని తగ్గించి తాగునీటి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శుక్రవారం తుఫాను ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం గురువారం రాత్రే అమరావతి నుంచి విశాఖ మీదుగా శ్రీకాకుళం చేరుకున్నారు. ఉదయం నష్టం సంభవించిన ప్రాంతాలను విహంగ వీక్షణం చేశారు. రహదారి మార్గం లేని ఇచ్ఛాపురం, పాతపట్నం ప్రాంతాలను హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సత్యనారాయణ, కలెక్టర్‌ ధనంజయరెడ్డి ఆయనతో పాటే ప్రయాణించి నష్టం ఎలా జరిగింది, ఏయే ప్రాంతాలు దెబ్బతిన్నాయో వివరించారు. అనంతరం కాశీబుగ్గలో దిగిన సీఎం.. రోడ్డు మార్గంలో పలాస పట్టణంలో నష్ట తీవ్రతను పరిశీలించారు. తిత్లీ తుఫాను తీరం దాటిన వజ్రపుకొత్తూరు మండలాన్ని సందర్శించారు. అన్ని ఊళ్లకూ వెళ్తానని, అందరి బాగోగులూ చూస్తానన్నారు. బాధితులంతా తేరుకున్నాకే తిరిగి వెళ్తానని భరోసా ఇచ్చారు. అంతవరకు పలాస నుంచే పాలన సాగిస్తానన్నారు. శుక్రవారం రాత్రి నుంచి నోడల్‌ అధికారులంతా బాధిత గ్రామాల్లోనే ఉండాలని, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.