అగ్రస్తానంలో యాపిల్‌

apple takes first place

ప్రపంచంలోనే టాప్‌ బ్రాండ్‌గా గూగుల్‌ను తోసిరాజని, యాపిల్‌ నిలిచింది. డేటా లీక్‌ల వంటి వివాదాల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ స్థానం 9కి దిగజారింది. అంతర్జాతీయ బ్రాండ్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్‌ ‘2018 అత్యుత్తమ 100 అంతర్జాతీయ బ్రాండ్స్‌’ శీర్షికన నివేదికను గురువారం విడుదల చేసింది. ఈ ప్రకారం..

         యాపిల్‌ బ్రాండ్‌ విలువ ఏడాది క్రితంతో పోలిస్తే 16 శాతం పెరిగి 214.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 15.66 లక్షల కోట్లు)కు చేరింది. అమెరికాలో లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.73 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువ సాధించిన తొలి కంపెనీగా ఘనత పొందింది. తాజా ఆవిష్కరణలైన ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌, ఎక్స్‌ఆర్‌ల ద్వారా సంస్థ విలువ మరింత పెరిగింది. దీంతోపాటు అధికులకు ఉపయోగపడే యాప్‌లు, సేవలను ఆవిష్కరిస్తోంది. 2017 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సేవల విభాగ ఆదాయం 23 శాతం వృద్ధితో 30 బి.డాలర్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది.
        జాబితాలో 2వ స్థానంలో నిలిచిన గూగుల్‌ బ్రాండ్‌ విలువ 10 శాతం పెరిగి 155.5 బి.డాలర్ల (సుమారు రూ.11.35 లక్షల కోట్లు)కు చేరింది.
       అమెజాన్‌ బ్రాండ్‌ విలువ 56 శాతం వృద్ధితో 100.8 బి.డాలర్లకు చేరడం ద్వారా, 3వ స్థానం పొందింది.
       మైక్రోసాఫ్ట్‌ (92.7 బి.డాలర్లు -4వ స్థానం), కోకకోలా (66.3 బి.డాలర్లు-5వ స్థానం), శామ్‌సంగ్‌ 6వ స్థానం పొందాయి.
       * కేంబ్రిడ్డ్‌ అనలిటికా డేటా లీక్‌ల వివాదంతో, ఫేస్‌బుక్‌ బ్రాండ్‌ విలువ 6శాతం తగ్గింది. ఫలితంగా 9వ స్థానానికి దిగజారింది.