తెలంగాణ పోలింగ్ కు సర్వం సిద్ధం

arrangements-telangana-polling
ఈ నెల 7న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్‌ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, 1,404 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశంలో దానకిషోర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలను ఇలా వెల్లడించారు.

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు

  •  జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 313 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
    అన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ దాదాపు పూర్తయింది.
  • ప్రభుత్వ ముద్రణ సంస్థ నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించాం.
  • జిల్లాలో 40,57,488 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితా ప్రకటన అనంతరం రెండు అనుబంధ జాబితాలుగా ఓటర్ల పేర్లు చేర్చాం.
  • గుర్తింపు ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థికి ఉచితంగా ఓటరు జాబితా అందించాలని రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలిచ్చాం.
  • 4,988 మందికి పోస్టల్‌ బ్యాలెట్లు పంపాం. కౌంటింగ్‌కు ఒకరోజు ముందుకు వరకు పోస్టల్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారులకు పంపొచ్చు.
  • పోస్టల్‌ బ్యాలెట్లు పంపిన వారి పేర్లను జాబితాలో మార్క్‌ చేసి ఆరు సెట్ల జాబితాలు ముద్రిస్తారు. పోలింగ్‌ సిబ్బందికి వాటిని అందజేయడం ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిన వారి పేరిట ఓటు వేసే అవకాశం ఉండదు.
  • ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి రిటర్నింగ్‌ ఆఫీసర్లకు అందింది.
    ఓటరు ఐడీ కార్డు లేకున్నా ఆధార్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ తదితర 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూయించి ఓటు వేయొచ్చు.
  • ఈవీఎంల మొదటి, రెండో దశ ర్యాండమైజేషన్‌ పూర్తయింది. పోలింగ్‌ రోజున ఉదయం 6 గంటల నుంచి 6.45 వరకు ఏజెంట్ల ముందు మాక్‌ పోలింగ్‌ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పించాం.
    ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో రెండు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశాం.
  • మహిళల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున పింక్‌ పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి.

పోలింగ్‌ శాతం పెంపునకు..

జిల్లాలో సగటు పోలింగ్‌ 53-54 శాతంలోపే ఉంటున్న నేపథ్యంలో పెంపుపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూలో కరపత్రాలు పంపిణీ చేశాం. ఆస్తి పన్ను చెల్లింపుదారులు, ఇతర ఓటర్లు 11 లక్షల మంది మొబైళ్లకు ఓటు వేయాలని ఎస్‌ఎంఎస్‌లు పంపాం. ఏమైనా సందేహాలుంటే జీహెచ్‌ఎంసీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-2999కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

దివ్యాంగుల కోసం…

జిల్లాలో 18,042 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్టు గుర్తించాం. వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. వాదా యాప్‌ ద్వారా పేరు నమోదు చేసుకుంటే వాళ్లు ఉన్న చోటుకు వాహనాన్ని పంపిస్తాం.

పక్కా నిఘా..

ఎన్నికల నేపథ్యంలో నిఘా బృందాలు, పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. నెల రోజుల్లో 23.81 కోట్ల నగదు, 13వేల లీటర్లకుపైగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి, మత్తు పదార్థాలు కూడా తనిఖీల్లో పట్టుబడ్డాయి.

ఎన్నికల ఏర్పాట్లు

  • పోలింగ్‌ కేంద్రాలు 3873
  • ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు 3873
  • పోలింగ్‌ ఆఫీసర్లు 11,619
  • రిజర్వ్‌ స్టాఫ్‌ 3100(20 శాతం)
  • మైక్రో అబ్జర్వర్లు 661