కాళేశ్వ‌రం అక్ర‌మాల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ ఫిర్యాదు

కాళేశ్వ‌రం అక్ర‌మాల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు బీజేపీ ఫిర్యాదు

 

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ప‌లు అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని వాటిపై త‌క్ష‌ణం సీబీఐ, సీఐడి విచార‌ణ జ‌రిపించాల‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళసైకి  ఫిర్యాదు చేశారు బీజేపీ నేత‌లు.  తెలంగాణ‌లో ప్రాజెక్టుల పేర్లు చెప్పి సీఎం కేసీఆర్‌ అక్రమ సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు.  

సంజ‌య్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం శనివారం గవర్నర్‌ తమిళసైతో భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్  మీడియాతో మాట్లాడారు. కాళేశ్వ‌రం  ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీల కోసం కొత్తగా టెండర్లను పిలిచి మెగా, నవయుగ, ప్రతిమ కంపెనీలకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్‌ దొంగలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు.

పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్‌ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ మెగా ముఖ్యమంత్రిగా, మెగా స్కాంలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. లాక్‌డౌన్‌లో సీఎం ప్రెస్‌ మీట్‌లు అపహాస్యంగా మారయని, మీడియా ఆయనకు అనుకూలంగా ఉందని ఆయన అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కానీ ఆయన బెదిరించి మీడియాను కంట్రోల్‌ చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదన్నారు. 

కేసీఆర్‌ డైరెక్షన్‌లో జరుగుతున్న లూటీకి బీజేపీ వ్యతిరేకమని ఆయన అన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. దీనిపై సీబీఐ, సీఐడీ విచారణ జరపించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఇక ప్రతిపక్షాలను సీఎం ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.