ఆ డబ్బంతా బాబుదే... అప్రూవర్ గా మారిన పీఏ శ్రీనివాస్?

ఆ డబ్బంతా బాబుదే... అప్రూవర్ గా మారిన పీఏ శ్రీనివాస్?

చంద్రబాబు రాజకీయ జీవితంలోనే విపత్కర పరిస్థితులు సంభవించాయి. ఐటీని నేనే కనిపెట్టానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకి ఇప్పుడు ఐటి సోదాలతో పెనుముప్పు సంభవించింది. మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో జరిపిన ఐటి సోదాల చిట్టాను ఐటిశాఖ బయటపెట్టి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ల రాజకీయ భవిష్యత్ నే ప్రశ్నార్థకంగా మార్చేసింది. చంద్రబాబు పీఏ రూపంలో ఇప్పుడు చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు. తాను టెక్నికల్ గా ఎప్పుడూ తప్పు చేయనని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. చంద్రబాబు చిట్టా మొత్తం ఇప్పుడు ఆయన మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో బట్టబయలైపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేసిన సంస్థలు, లాబీయింగ్ చేసిన వ్యక్తుల ఇళ్లల్లో, సంస్థల్లో సోదాలు ,పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు ఏకకాలంలో జరగడంతో గంపగుత్తిగా బుక్కైపోయారు చంద్రబాబు టీమ్. 

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సోదాలఫై ఇన్‌కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ప్రకటన జారీచేసింది. మూడు ఇన్ఫ్రా కంపెనీల్లో 2000 కోట్ల లావాదేవీలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. హైద్రాబాద్, విజయవాడ, ఢిల్లీ, పూణే, కడప, వైజాగ్ తో సహా మొత్తం 40 చోట్ల సోదాలు జరిగాయి. మూడు ఇన్ఫ్రాల ద్వారా కోట్లరూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా జరిపిన లావాదేవీలు వివరాలు సేకరించారు అధికారులు. ఇటీవల ఏపీలో టీడీపీ నాయకుల సన్నిహితులపై ఐటీ దాడులు జరుపగా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అకౌంట్లు లేనట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నెల 6న విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పూణేలో ఐటీ శాఖ దాడులు జరిపింది. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ తో సహా మరో మూడు సంస్థలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు. 25 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. బోగస్ బిల్లులతో పాటు, బోగస్ ఇన్వాయిస్ లు, బోగస్ సబ్ కాంట్రాక్టులను అధికారులు గుర్తించారు.ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు ఐటీ అధికారులు భావిస్తున్నారు.

పన్ను లెక్కలకు దొరకకుండా రూ 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధుల దారి మళ్లించినట్లు గుర్తించారు. బోగస్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. ఐటి శాఖ ప్రకటించిన వివరాల్లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు లో కీలకమైన డాక్యుమెంట్లు గుర్తించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన సంస్థలు, చంద్రబాబు చుట్టూ ఉన్న వ్యక్తుల సంస్థల ద్వారా జరిగిన లావాదేవీల వివరాలు పీఏ శ్రీనివాస్ ఇంట్లో బట్టబయలైనట్టు సమాచారం. 

ఏకంగా 5 రోజుల పాటు పీఏ శ్రీనివాస్ ఇంట్లో రాత్రి పగలు గ్యాప్ లేకుండా సోదాలు జరపడంతో శ్రీనివాస్ కీలకమైన విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని, పోలవరం తో పాటు పలు వర్కులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టు సంస్థల లావాదేవీల మెయిల్స్, వాట్సాప్ సందేశాలు శ్రీనివాస్ ఇంట్లో లభించాయి.  గట్టిగా శ్రీనివాస్ ని నిలదీసేసరికి ఇవన్నీ తనకేం సంబంధంలేద‌ని ఆయన అసలు నిజం కక్కేసారన్నది ఐటి వర్గాల సమాచారం. శ్రీనివాస్ అప్రూవర్ గా మారిపోయారన్నది ఐటి శాఖ అధికారులు అందిస్తున్న విశ్వసనీయ సమాచారం. ఆ విషయం చంద్రబాబుకి కూడా తెలిసి హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ డబ్బంతా చంద్రబాబు లావాదేవీలవే అని శ్రీనివాస్ చెప్పేశారన్న గుబులు టీడీపీలో ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. అందుకే చంద్రబాబు, కానీ లోకేష్ కానీ ఐటి సోదాలపై నోరు విప్పాలంటే భయపడిపోతున్నారు.  శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం తరువాత ఎవరి ఇంటిపైకి ఐటి శాఖ కొరడా జులిపిస్తుందోనన్న టెన్షన్ టీడీపీ నేతల్లో పట్టుకుంది.