జూన్ 1 న మరోసారి సీఎం జగన్ తో చిరంజీవి భేటీ

జూన్ 1 న మరోసారి సీఎం జగన్ తో చిరంజీవి భేటీ

 

ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకరత్న దాసరి లేని లోటుని పూడుస్తూ మెగాస్టార్ చిరంజీవి అన్నీ తానై, తెలుగు ఇండస్ట్రీలో చిన్నాపెద్ద సమస్యలపై పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. అలాగే రెండు తెలుగు ప్రభుత్వాలతోనూ మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నారు. షూటింగ్స్ మొదలవడం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసిన చిరంజీవి.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ని కలవబోతున్నారు.

ఏపీ సీఎంఓ నుంచి చిరంజీవికి జూన్ 1 సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం వచ్చిందట. వాస్తవానికి ఈ వారమే చిరంజీవి జగన్ ని కలవనున్నారు. కానీ జగన్ ఏడాది పాలనపై మన పాలన మీ సూచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జగన్ బిజీగా ఉండటం వల్ల కలవడం వీలవ్వలేదు. 

దాంతో సీఎంఓ ఆఫీస్ నుంచి జూన్ 1 సాయంత్రం మీటింగ్ ఉండటంతో చిరంజీవి, జగన్ మధ్య ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ డెవలప్ మెంట్, స్టూడియోల నిర్మాణం, రాయితీలు, థియేటర్స్ లాంటి విషయాలు చర్చకు రానున్నాయి.

చిరంజీవి గతంలో జగన్ ని కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్స్ గురించి, లొకేషన్స్ కి సింగిల్ విండో పర్మిషన్స్ గురించి చర్చించారు. చిరంజీవిపై గౌరవంతో జగన్ ఇటీవల జీవో నెం 45 ను విడుదల చేశారు. అలాగే ఏపీలో ఫ్రీగా షూటింగ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు జరగబోతున్న భేటీలో జగన్ పై సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఆశలు పెట్టుకుందని సినిమా పెద్దలు అభిప్రాయపడుతున్నారు.