తిరుమలలో మహిళను వేధిస్తున్న సీఐ

0
118
ci abused to victim in tirumala

తిరుమలలో విధుల్లో ఉన్న ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు(సీఐ)పై వచ్చిన వేధింపు ఆరోపణలు మంగళవారం రాత్రి ఆయన సస్పెన్షన్‌కు దారితీశాయి. సిద్ద తేజామూర్తి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం సీఐగా గత ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు 10 నుంచి పీలేరు సర్కిల్‌కు ఇన్‌స్పెక్టరు లేకపోవడంతో అక్కడ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే పీలేరుకు చెందిన ఓ భార్యభర్తల కేసులో ఆయన తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి. ఎప్పుడో నమోదైన కేసులో తన ఫోన్‌ నెంబరు ఆధారంగా స్టేషన్‌కు రప్పించడంతో పాటు అసభ్యంగా వాట్సాప్‌లో ఛాటింగ్‌ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల కిందట ఫోన్‌ చేసి.. తిరుమలకు రావాలని చెప్పినట్లు ఆమె చెప్తున్నారు. నందకం రెస్ట్‌హౌస్‌లో గదిని బుక్‌ చేశానని సీఐ ఫోన్‌లో చెప్పినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మహిళా సంఘాలను వెంటబెట్టుకొని తిరుమలకు వచ్చిన ఆమె.. తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మహంతిని కలిసేందుకు ప్రయత్నించారు. తేజామూర్తిని ‘ఈనాడు’ ఫోన్‌లో వివరణ కోరగా.. తాను ఏ మహిళనూ రమ్మనలేదని కొట్టిపారేశారు. నందకం రెస్ట్‌హౌస్‌లో వాకబు చేయగా బాధితురాలు చెబుతున్న గదిని తిరుపతికి చెందిన మోహన్‌కుమార్‌ అనే వ్యక్తి పేరిట మంగళవారం మధ్యాహ్నం వరకు బుక్‌ చేసినట్లుగా  సిబ్బంది వెల్లడించారు. ఈ నేపథ్యంలో కర్నూలు రేంజి డీఐజీ శ్రీనివాస్‌.. తేజామూర్తిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.