తెలంగాణకు మిడతల ముప్పుపై సీఎం కేసీఆర్ సమీక్ష..

తెలంగాణకు మిడతల ముప్పుపై సీఎం కేసీఆర్ సమీక్ష..

 

క‌రోనాతో తీవ్ర ఆందోళ‌న‌కు గురవుతున్న భార‌త్ కు ఇప్పుడు మిడ‌తల దండు రూపంలో మ‌రో ఇబ్బంది త‌లెత్తుతున్న‌ సంగ‌తి తెలిసిందే. తూర్పు ఆఫ్రికా నుంచి అరేబియా ద్వీపకల్పం, పాకిస్తాన్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన ఎడారి మిడతల దండు, పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేల ఎకరాలలో పంటల పొలాలను నాశనం చేస్తోంది.

 అయితే ఈ రాకాసి మిడ‌త‌ల దండు మ‌హారాష్ట్ర త‌రువాత తెలంగాణ వైపు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. దీంతో  మిడత దండు గమనంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
 
ఇందులో భాగంగా మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధికారుల‌తో  చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్త్రవేత్తలు, పలువురు నిపుణులు హాజరయ్యారు. ఈ మిడ‌త‌లు ప్ర‌స్తుతం మహారాష్ట్రలోని అమరావతి వరకు చేరుకున్నాయ‌ని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టునీ తినేసే ఈ మిడతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని వివ‌రించారు.
 
ఇలాంటి నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌తో స‌రిహ‌ద్దు క‌లిగిన తెలంగాణలోని నిజామాబాద్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలలోకి మిడ‌త‌లు చేర‌కుండా త‌గిన‌న్ని ఏర్పాట్లు చేయాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. దీనికోసం వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అధికారులను  సూచించిన‌ట్టు తెలుస్తోంది.