భర్త ఆచూకీ కోరిన కరోనా పేషెంట్ భార్య.. షాకింగ్ నిజాలు చెప్పిన సిబ్బంది

భర్త ఆచూకీ కోరిన కరోనా పేషెంట్ భార్య.. షాకింగ్ నిజాలు చెప్పిన సిబ్బంది

 

క‌రోనా మ‌హ‌మ్మ‌రితో గాంధీ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేద‌ని ఓ మ‌హిళ, మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేయ‌డంతో షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వివ‌రాల్లోకి వెళ్తే మలక్‌పేట గంజ్‌లో నూనె వ్యాపారం చేస్తూ వనస్థలిపురం బీఎన్ రెడ్డి కాలనీలో నివసించే మధుసూదన్ మ‌రియు అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు ఏప్రిల్ 30న క‌రోనా పాజిటివ్ గా తేలింది. 

దీంతో మధుసూదన్ ను మొదట కింగ్ కోఠి హాస్పిటల్‌కు తరలించిన అధికారులు తర్వాత గాంధీ హాస్పిటల్‌కు మార్చారు. కరోనా నుంచి కోలుకున్న మిగతా కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా మధుసూదన్ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త కనిపించడం లేదని మధుసూదన్  భార్య ఆలంపల్లి మాధవి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ విష‌యంపై  పోలీసుల నుంచి తనకు ఎలాంటి మద్దతు అందడం లేదని, ఆస్పత్రి వర్గాలు సహకరించడం లేదని వరుస ట్వీట్లతో కంప్లైంట్ చేసింది. దీంతో స్పందించిన గాంధీ ఆసుప‌త్రి యాజమా‌న్యం స‌ద‌రు వ్య‌క్తి గురించి షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. వ‌న‌స్థలిపురంకు చెందిన మధుసూదన్(42) ఏప్రిల్ 30న సాయంత్రం 7.45 కు కరోనా పాజిటివ్ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరార‌ని తెలిపారు. అయితే అప్ప‌టికే ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో మే1న సాయంత్రం 6.30 గంట‌ల‌కు మ‌ర‌ణించాడ‌ని వెల్ల‌డించారు.

దాంతో నిబంధనల ప్రకారం మధుసూదన్ మరణ వార్తను కుటుంబ సభ్యులకు తెలిపామని, మృతదేహాన్ని పోలీసులకు అప్పగించామని, దాన్ని ధ్రువీకరిస్తూ సంతకం కూడా తీసుకున్నామని తెలిపారు.  ఒక‌వేళ కుటుంబ సభ్యులు స్పందించకపోతే జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తారని, ఈ కేసులోనూ అదే జరిగిందని వివరణ ఇచ్చారు. మధుసూదన్ మృతదేహానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు జరిపారని, ఆ తర్వాత మధుసూదన్ కుటుంబ సభ్యులంతా కూడా కోవిడ్ బారినపడి గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందారని య‌జమ‌న్యం చెప్పుకొచ్చింది. 

కోవిడ్ రోగి మృతి విషయంలో పాటించాల్సిన అన్ని నిబంధనలు పాటించామని, ప్రాణాలకు తెగించి రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై ఇలా అభియోగాలు మోపడం సరికాదని పేర్కొంది.