పంట మార్పిడి రైతుల కోస‌మే: మంత్రి హరీష్‌రావు

పంట మార్పిడి రైతుల కోస‌మే: మంత్రి హరీష్‌రావు

 

తెలంగాణ రైతులు పంట‌మార్పిడిని అల‌వాటు చేసుకోవాల‌ని సీఎం సూచించ‌డం రైతుల శ్రేయ‌స్సు కోస‌మేన‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హ‌రీష్‌రావు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు మొద‌ట రైతని, అందువ‌ల్లే ఆయ‌న రైతుల‌కు ప్ర‌యోజ‌నం, లాభం క‌లిగించే నిర్ణ‌యాలు మాత్ర‌మే తీసుకుంటారని అన్నారు.

ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాల‌కు అనుగుణంగా రైతులతో నియంత్రణ వ్యవసాయ సాగు ప్రోత్స‌హించి విధంగా  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు,  కో ఆపరేటివ్ ఛైర్మన్లు కీలక పాత్ర పోషించాల‌ని  మంత్రి హరీష్‌రావు అన్నారు. మంత్రి హ‌రీష్‌రావు శనివారం మీడియాతో మాట్లాడుతూ రైతు ఆత్మగౌరవంతో బతకాలన్నదే, లాభసాటిగా ఉండాలన్నదే కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. 

రైతు బంధును ఆపడానికే నియంత్రిత వ్యవసాయ సాగు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. దేశానికే ఆదర్శం రైతుబంధు పథకం అని ఈ సారి కోటీ నలబై వేల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. జూన్ నెలలోగా ఏడు వేల కోట్లు... కోటీ నలబై లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా సీఎం ఆలోచనలకూ దగ్గరగా ఉందని మంత్రి పేర్కొన్నారు.  

సంగారెడ్డి జిల్లాలో 6.38 లక్షల ఎకరాల్లో సాగు జ‌రుగుతుంద‌న్నారు. వానాకాలంలో కాకుండా యాసంగిలో మొక్కజొన్న వేయాలని చెబుతున్నామని తెలిపారు. వానకాలంలో మాత్రం పంట మార్పిడి జరగాలన్నారు.  సంగారెడ్డి జిల్లాలో అతి ఎక్కువ సాగు చేసే పంట పత్తి అని... పత్తికి నాణ్యమైన విత్తనాలను అందిస్తామని అన్నారు.  రబీలో నకిలీ పత్తి విత్తనాలను అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేశామని మంత్రి తెలిపారు. 

గత ఏడాది 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని ఈ సారి ఇంకో పదిహేను వేల ఎకరాలు పెరుగుతుందన్నారు. వానాకాలంలో కంది, పెసర వంటి పప్పు దినుసులు వేసుకోవాలన్నారు. యాసంగిలో మొక్కజొన్న వేసుకుంటే వడగళ్లు వచ్చినా ఇబ్బంది లేదన్నారు. రైతు శ్రేయస్సు కోసమే పంట మార్పిడి విధానాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఒకటే పంట వేసుకుంటూ పోతే దిగుబడి తగ్గుతుందని... భూమిలో సారం కూడా తగ్గుందన్నారు. 

ప్రతి ఊరికీ సాగుకు ముందే ఫెర్టిలైజర్ తీసుకుపోవాలని సూచించారు. ఫెర్టిలైజర్ అందరికీ అందేలా రైతు సమన్వయ సమితిలు, సహకార సంఘాల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతి ఊరికి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. 

సంగారెడ్డి నేలల్లో బాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉందని...రైతులు ఇది గమనించి వీటిని తగ్గించేలా ఏఈఓలు కృషి చేయాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో 116 రైతు బంధు వేదికలున్నాయని, ప్రతి రైతు బంధు వేదిక నిర్మాణానికి కేసీఆర్ రూ.20 లక్షల చొప్పున ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో రైతు బంధు వేదికలదే కీలక పాత్ర అని తెలిపారు. యాసంగి పంటలు వేసే నాటికి రైతు బంధు వేదికలు నిర్మాణం జరగాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒకే రోజు రైతు బంధు వేదికలకు ఏక కాలంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.