కోహ్లీ సత్తా ఏంటో మీరే చూస్తారు : రాహుల్ జోహ్రీ

కోహ్లీ సత్తా ఏంటో మీరే చూస్తారు : రాహుల్ జోహ్రీ

 

న్యూజిలాండ్ తో జరిగి వన్డే, టెస్ట్ సిరీస్ లలో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ సిరీస్ లో ఓటమిపై క్రికెట్ అభిమానులతో పాటు టీమిండియా మజీ ప్లేయర్లు సైతం కెప్టెన్ కోహ్లీనే తప్పుబట్టారు. కోహ్లీ వల్లే టీం ఓడిపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. విరాట్ ఫిట్ నెస్ పై కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

హోలీ పండుగను జరుపుకోవటానికి జోహ్రీ బరేలీలోని తన ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన దీనిపై స్పందించారు.  కేవలం ఒక సిరీస్ ఆధారంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను ప్రశ్నించడం మంచిది కాదని ఆయన అన్నారు. విరాట్ ప్రపంచంలోనే అత్యంత ఫిట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు.  ప్రతి క్రికెటర్ జీవితంలోనూ హెచ్చు తగ్గులు వస్తాయని న్యూజిలాండ్‌లో విరాట్‌కు కూడా అదే జరిగిందని గుర్తు చేశారు. అతను ఎంత ఫిట్ ప్లేయర్ అనేది దక్షిణాఫ్రికా సీరీస్ లో అందరూ తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, మహేంద్ర సింగ్ ధోని స్థానం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జట్టులో ప్రతి స్థానానికి ఎంపికలు ఉన్నాయన్నారు.మహేంద్ర సింగ్ ధోని తర్వాత జట్టుకు మంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దొరకలేదా అనే ప్రశ్నపై రాహుల్ జోహ్రీ స్పందించారు.  ఫ్యూచర్ స్ట్రాటజీ గురించి ఆలోచించే  మేనేజ్మెంట్  నిర్ణయాలు తీసుకుంటుందని,  పదేపదే మార్పులు కూడా దానిలో భాగమేనన్నారు.. ఈ సమయంలో జట్టులోని ప్రతి స్థానం వద్ద ఆటగాళ్లకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 

మహిళా జట్టు నిరాశ చెందాల్సిన అవసరం లేదు..

టీ 20 ఫైనల్‌లో మహిళా క్రికెట్ జట్టు ఓటమిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్లేయర్లు తమ పని తాము చేశారన్నారు. ఫైనల్స్‌కు దూరమయినప్పటికీ, దేశంలో మహిళా క్రికెట్ బలం పెరిగిందని తెలిపారు. ఈ సారి టోర్నీలో భారత జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా  టీమ్ ఇండియా 99 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 85 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకుంది.