దిశ పోలీస్ స్టేష‌న్ చేయాల్సిన ప‌నేంటి.. చేస్తున్న‌దేంటి ?

దిశ పోలీస్ స్టేష‌న్ చేయాల్సిన ప‌నేంటి.. చేస్తున్న‌దేంటి ?

దిశ పోలీస్‌ స్టేషన్ రాజమహేంద్రవరం పోలీసులకు తలనొప్పిగా మారింది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకుండానే పీఎస్‌ ప్రారంభించడంతో బాధితులు, రాజకీయ వర్గాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు.

ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం 2019 లో భాగంగా రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేష‌న్‌ ఏర్పాటు చేశారు. ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ ఫిబ్రవరి 8వ తేదీ శనివారం ప్రారంభించారు. ఇక అప్పటి నుండి దిశా పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇదే ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. దిశ పోలీసు స్టేషన్ ప్రారంభం అయిన 24 గంటలు తిరగకముందే రాజమహేంద్రవరంలో బాధితులు క్యూ కట్టారు. గతంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులే... దిశ పీఎస్‌కు రావడంతో వాటిని నమోదు చేయాలా వద్దా అని తలలు పట్టుకుంటున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే ఏపీలో దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం కావటంతో ఏపీలో బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ పోలీసులు పార్లమెంట్ లో దిశా చట్టం బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి ఆ చట్టం ప్రకారం ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. పార్లమెంటులో దిశ చట్టం ఆమోదం పొందకపోవడంతో బాధితులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు

రాజమండ్రి దిశ పీఎస్‌లో ఇన్నీసుపేటకు చెందిన మౌనికాదేవి మొట్టమొదటి ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తమామలు ఏడేళ్లుగా వేధిస్తున్నారని... వారిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది. నెహ్రూ నగర్‌కు చెందిన జ్యోతిర్మయి రెండో ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం నాలుగేళ్లుగా తన అత్తమామలు వేధిస్తున్నారని పోలీసుల్ని ఆశ్రయించింది. వీటిపై విచారణ చేపట్టిన మహిళా అధికారులు ఇవి సాధారణ గృహిణుల కేసులు కావడంతో వారికి సర్ది చెప్పి వెనక్కి పంపించారు.

దిశ పీఎస్‌లో మూడో కేసును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పెట్టారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాను మద్యం పాలసీపై మాట్లాడిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఆరోపించారు. నిందితులపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పోలీసుల్ని కోరారు. టీడీపీ మహిళా నేతలు, పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పై ఫిర్యాదు చేశారు. . ఇక ఈ వ్యవహారంతో పోలీసులు దిశా చట్టం క్రింద కేసులు నమోదు చెయ్యలేక , సాధారణ పోలీస్ స్టేషన్ గా చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు.