ఏపీలా చేయండి.. ఆదేశించిన కేంద్రం

ఏపీలా చేయండి.. ఆదేశించిన కేంద్రం

 

దేశమంతా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా వ్యూహం ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆచరణ మార్గంలా మారింది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఆదేశించిన మాట. 

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రతీ రోజూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన చర్యలపై కేంద్రం నిత్యం మార్గదర్శకాలు, సూచనలు జారీ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. దేశం మొత్తాన్ని స్తంభింపచేశారు. ఈ సమయంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసింది.
 
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రతీ ఒక్కరినీ ట్రాక్ చేశారు. వెంటపడి మరి వారిని క్వారంటైన్ లో ఉంచి కరోనా వైరస్ సంక్రమించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దానివలన ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. ఉధ్రుతంగా క్షేత్రస్థాయిలో నివారణా చర్యలు, అవగాహన ఇంటింటికీ వెళ్లి కలిగించగలిగారు. 

ఈ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డిలు కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. దానిపై రెండు రోజుల పాటు ఫలితాలను కేంద్రం , కేంద్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేశాయి. వెంటనే ఇది మంచి సత్ఫలితాలిస్తుందని భావించారు. వెంటనే అన్ని రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టు విదేశాల నుంచి వచ్చే వారిని ప్రతీ ఒక్కరినీ లాక్ డౌన్ కాలంలో ట్రాక్ చేయాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ పై ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఆరాతీస్తున్నాయి. పర్మినెంట్ సిబ్బంది లేకపోవడంతో తాత్కాలికంగా స్వచ్ఛంద సేవకుల ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కరోనా బాధితులను ట్రాక్ చేసేందుకు సర్వే చేస్తున్నాయి. జగన్ ప్రజలకు ఇంటింటికీ సేవలందించేందుకు చేసిన ఈ వాలంటీర్ల ఆలోచన ఇప్పుడు దేశానికే అత్యుత్త‌మ‌ వ్యవస్థగా మారడంతో అధికారులంతా జగన్ ఆలోచనను అభినందిస్తున్నారు.