క‌రోనాతో చ‌నిపోయిన య‌జ‌మాని కోసం.. 3 నెల‌లుగా కుక్క ఆరాటం

క‌రోనాతో చ‌నిపోయిన య‌జ‌మాని కోసం.. 3 నెల‌లుగా కుక్క ఆరాటం

 

ప్ర‌పంచంలోనే అత్యంత విశ్వాసం చూపించే జంతువులు కుక్క‌లు మాత్ర‌మే.. అందుకే కుక్క‌ల్ని ప్రాణంగా ప్రేమించే య‌జ‌మానులు కూడా ఉంటారు. య‌జ‌మాని ఒక్క మాట చెప్పి ఎక్క‌డికైనా వెళితే, మ‌ళ్ళీ య‌జ‌మాని వ‌చ్చి పిలిచే దాకా అక్క‌డి నుండి ఒక్క అడుగు కూడా వెయ్య‌వు కుక్క‌లు... అంత ప్రేమ‌గా ఉంటాయి. ఎప్పుడైనా య‌జ‌మానికి ఏధైనా జ‌రిగితే కుక్క‌లు విల‌విల్లాడిపోతాయి... అలాంటి సంఘ‌ట‌న ఒక‌టి క‌రోనా వైర‌స్ పుట్టిన వుహాన్ లో చోటుచేసుకుంది. 

క‌రోనా వైర‌స్ త‌న య‌జ‌మానిని పొట్ట‌న పెట్ట‌కున్న విష‌యం తెలియ‌క ఓ కుక్క త‌న య‌జ‌మాని కోసం ఏకంగా 3 నెలగా హ‌స్పిట‌ల్ లో ఎదురుచూస్తూనే ఉంది. వివ‌రాల్లోకి వెళ్తే.. వుహాన్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ఆసుపత్రికి వెళ్లాడు. వెళ్తూవెళ్తూ తన పెంపుడు శునకం గ్జియావో బేవోను కూడా తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో చేరిన అతడు పరిస్థితి విషమించడంతో ఐదు రోజుల్లోనే తుదిశ్వాస విడిచాడు. కానీ, తన యజమాని చనిపోయిన విషయం తెలియని ఆ శునకం మాత్రం అతడి కోసం ఆసుపత్రిలో ఎదురుచూస్తూనే ఉంది. 

నిద్రాహారాలు మాని తన యజమాని కోసం ఉన్న చోటు నుంచి కదలకుండా ఎదురుచూస్తున్న శునకాన్ని చూస్తున్న ఆసుపత్రి సిబ్బంది గుండెలు కరిగిపోయాయి. దీంతో దానిని తీసుకెళ్లి దూరంగా వేరే ప్రదేశంలో వదిలేసి వచ్చారు. అయినా అది హ‌స్పిట‌ల్ వెతుక్కుంటూ వ‌చ్చింది.

అది చూసిన హాస్పిట‌ల్ యాజ‌మాన్యం మ‌న‌సు క‌రిగిపోయింది. అప్ప‌టి నుండి ఆ కుక్క బాగోగులు ఆ హాస్పిట‌ల్ యాజ‌మాన్యమే చూసుకుంటుంది.. ఆ కుక్క మాత్రం త‌న య‌జ‌మాని కోసం ఎదురు చూస్తూనే ఉంది.