
లాక్ డౌన్ కాలంలో చాలామంది రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో అలా నడుచుకున్న వారి వాహనాలను పోలీసులు సీజ్ చేయడమే గాక, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకూ నాలుగున్నర లక్షలకు పైగా లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
దాంతో ఈ కేసులను విచారణ చేయడం అధికారులకు తలకు మించిన భారం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణను చేపట్టాలని ఉన్నతాధికారులు న్యాయశాఖను అభ్యర్థించారు. దీనికి న్యాయశాఖ అంగీకరించింది. దీంతో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు నమోదు చేసిన కేసులు ఈ-కోర్టుల ద్వారా విచారణ చేస్తామని న్యాయశాఖ తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించి జరిమానాలు విధిస్తారని వెల్లడించింది.
వీటిలో ముందుగా పెట్టీ కేసులతోపాటు లాక్డౌన్ టైంలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయడానికి వీలుగా న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిచిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.
అయితే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపులు తెరవడం, మాస్కుల, శానిటైజర్లను అధిక ధరలకు అమ్మడం, నకిలీ శానిటైజర్ల విక్రయం లాంటి వాటిని ఈ-పెట్టీ కేసులుగా గుర్తించారు. ఈ కేసులకు హాజరు కావడం కోసం వాహనదారులు మరియు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కోర్టు ముందుగా టైం స్లాట్ ఇవ్వనున్నట్లు సమాచారం.