సగటు ఆంధ్రుడు అడుగుతున్న ప్రశ్నలు

0
368
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన కొన్ని సంఘటనలకు ఎవరు బాధ్యులు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల్లో ఎవరి బాధ్యత ఎంత ఉంది. ప్రతి దానికీ వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు… తమ పాలనలో జరిగిన వాటి మీద ఎందుకు చర్చకు రావడం లేదు. ఇదే ఇప్పుడు సగటు ఆంధ్రుడు అడుగుతున్న ప్రశ్న.
 
దాదాపు ఆరు నెలల నుంచీ చంద్రబాబు అనుకూల మీడియా టార్గెట్ జగన్ దిశగా అడుగులు వేస్తోందట. మొదటి నుంచి జగన్ పార్టీని టార్గెట్ చేసిన ఎల్లో మీడియా… ఈ ఆరు నెలల నుంచీ మరీ జగన్ మీద వ్యతిరేక ప్రచారం ఎక్కువైందనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని కొట్టి పారేస్తున్నారు మీడియాలోని ఓ వర్గం. ఎవరి వాదన ఏంటో ఓసారి చూద్దాం.
 
తొమ్మిదేళ్లుగా జగన్ ఏం చేశారనేది ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించిన ప్రధాన ప్రశ్న. దీనికి జగన్ పార్టీ చెబుతోంది ఒక్కటే. రాష్ట్ర విభజనకు ముందు, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడూ జగన్ ఇంట్లో లేరట. ఏదో ఒక అంశంతో ఎప్పుడూ జనం మధ్యే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పాదయాత్ర ద్వారా జగన్ జనానికి మరింత దగ్గర అయ్యారనేది వారి వాదన. ఇక రాజధానిలో పొలాలను కొందరు తగలబెట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైసీపీ మీద, జగన్ మీద ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు కూడా వారిని అడ్డుకోలేదు. కానీ మూడేళ్ల విచారణ తర్వాత కేసు మూసేశారు ఏపీ పోలీసులు. నిజంగా ఈ కేసులో జగన్ పార్టీ ప్రమేయం ఉంటే ఎందుకు పట్టుకోలేదనేది వైసీపీ నేతల ప్రశ్న.
 
ఇక కాల్ మనీ కేసులో కూడా పులివెందులకు చెందిన వైసీపీ నేతలే దోషులంటూ ఏపీ మంత్రులతో పాటు చాలా మంది టీడీపీ నేతలు ఆరోపించారు. కానీ ఆ కేసులో ఎక్కువ శాతం బయట పడింది టీడీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన ఎంఎల్ఏలు. ఈ కేసులో కూడా వైసీపీ నేతల ప్రమేయం లేదన్నది తేలిపోయింది. ఇక తుని రైలు దహనం చేసిన కేసులో కూడా పులివెందుల గూండాలు అంటూ ప్రచారం చేశారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ఆరోపణ చేశారు. కానీ ఇప్పటి దాకా అరెస్ట్ అయిన వారిలో ఒక్కరు కూడా పులివెందులకు సంబంధించిన వారు లేరు. అంటే టీడీపీ నేతలు, చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని వైసీపీ చెబుతోన్న మాట.
 
ఇక అసెంబ్లీ తాత్కాలిక భవన నిర్మాణంలో పగుళ్లు వచ్చాయి. నీరు కారింది. అది కూడా వైసీపీ కుట్రే అని కొందరు టీడీపీ ఎంఎల్ఏలు ఆరోపించారు. కానీ అదంతా పచ్చి అబద్దాలని తేలిపోయాయని వైసీపీ చెబుతోంది. ఇక జగన్ మీద విశాఖలో జరిగిన హత్యాయత్నం కూడా సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ ఎంఎల్ఏలు వక్రీకరించారనేది వైసీపీ ఆరోపణ. ఇమేజ్ కోసమే జగన్ తన మీద తానే హత్యయత్నం చేశారని సీఎం, మంత్రులు, టీడీపీ ఎంఎల్ఏలు వాదించారు. కానీ కేసులో హత్యాయత్నం కింద నమోదు చేశారు. ఇదే వారి ఆరోపణలు తప్పని తేల్చిందని వైసీపీ చెబుతున్న మాట. ఇప్పుడు డేటా చోరీలో కూడా వైసీపీ, టీడీపీలు ఒకరి మీద మరొకరు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఎవరిది తప్పన్నదీ తేల్చాల్సింది పోలీసులే. మొత్తానికీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధంలో ఎవరిది కరెక్ట్ అన్నదీ జనమే తేల్చాలి.