టీఆర్‌ఎస్‌లో చేరనున్న మాజీ మంత్రి

0
131
jalagam prasada rao

దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు.. హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్‌ వ్యవహార శైలిపై.. తన బహిష్కరణపై పార్టీ అనుసరించిన నాన్చుడు ధోరణిని ఎండగట్టిన 24 గంటల్లోనే ఆ పార్టీ ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించింది.

అయితే జలగం ప్రసాదరావు మాత్రం తన అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని, నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదని, మూడు నెలలుగా పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ తన అభిమానులు, అనుచరుల్లో గందరగోళం సృష్టించడానికి ఈ తరహా ప్రయత్నం చేస్తోందంటూ శుక్రవారం తనను కలిసిన అభిమానులు, అనుచరులకు స్పష్టం చేశారు.