యూత్‌ ఒలింపిక్స్‌లో రైతు బిడ్డకు రజతం

0
70
farmer's son akash wins silver medal

అనుకోకుండా విల్లు పట్టిన ఆ ఆటగాడు… చరిత్ర సృష్టించాడు. దుక్కి దున్ని.. పంట తీసే కుటుంబం నుంచి వచ్చి.. అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటాడు. యూత్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీలో భారత్‌కు తొలి రజత పతకం అందించిన ఆటగాడిగా నిలిచాడు. అతనే హరియాణా కుర్రాడు ఆకాశ్‌ మలిక్‌. ఈ పదిహేనేళ్ల యువ సంచలనం ఫైనల్లో 0-6 తేడాతో ట్రెంటన్‌ కౌల్స్‌ (యుఎస్‌ఏ) చేతిలో ఓడి వెండి పతకం సొంతం చేసుకున్నాడు. చిరుజల్లుల నడుమ సాగిన ఫైనల్లో ఆకాశ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అనుకోకుండా విల్లు పట్టి ఈ స్థాయికి చేరుకున్న ఆకాశ్‌ది వ్యవసాయ కుటుంబం. ఆకాశ్‌ వాళ్ల నాన్న గోధుమ, పత్తి పంట పండిస్తాడు. ఓ రోజు కొంతమంది పిల్లలు విల్లులు పట్టుకొని బాణాలు వదులుతుంటే.. దేన్నో వేటాడుతున్నారు అనుకొని దగ్గరకు వెళ్లి చూసిన ఆకాశ్‌ ఆ ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత కోచ్‌ మంజీత్‌ మాలిక్‌ చొరవతో ఆటపై పట్టు సాధించాడు. అయితే ఆకాశ్‌ ఆర్చరీ వైపు వెళ్లడం వాళ్ల నాన్నకు మొదట్లో ఇష్టం లేదు. బుద్ధిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోమని చెప్తుండేవాడు. అయితే ఆకాశ్‌ పతకాలతో తిరిగి వస్తుంటే చూసి ప్రోత్సహించడం మొదలెట్టాడు. ‘‘రజతం గెలిచినందుకు ఆనందంగా ఉంది. కానీ స్వర్ణాన్ని కోల్పోయా. ప్రత్యర్థి నాకంటే మెరుగ్గా ఆడాడు. ఇక 2020 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి కృషి చేస్తా’’ అని ఆకాశ్‌ తెలిపాడు.