తెలంగాణ పోలీస్ శాఖ‌లో తొలి కోవిడ్ మ‌ర‌ణం..

తెలంగాణ పోలీస్ శాఖ‌లో తొలి కోవిడ్ మ‌ర‌ణం..

 

తెలంగాణ‌లో క‌రోనా కేసులు రోజురోజుకి  పెర‌గ‌డంతో పాటు మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తున్నాయి. దీనిలో భాగంగా  తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో నిరంతరం శ్రమ పడిన పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం సంభవించింది. హైదరాబాద్ నగరంలోని కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి(37) కరోనా సోకి  చికిత్స పొందుతూ నిన్న అర్థ‌రాత్రి మరణించారు. 

వివ‌రాల్లోకి వెళ్తే దయాకర్ రెడ్డి 2007 సంవత్సరంలో పోలీసు శాఖలో చేరాడు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నాడు. అయితే అతడు విధుల్లో చేరినప్పటి నుంచి కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో కోర్టుల్లో అత్యవసర కేసులను మాత్రమే పరిశీలిస్తుండడంతో అతడికి పురాణపూల్ సమీపంలోని చెక్ పోస్టు విధులు అప్పగించారు. అయితే ఈ ప్రాంతం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన జియాగూడ మార్కెట్‌కు సమీపంలో ఉంది. కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి కరోనా జియాగూడ మార్కెట్ నుంచి సోకి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

దీంతో  కానిస్టేబుల్ మృతిపై పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. అయితే  చ‌నిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీంతో  అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు డీజీపీ మ‌హేంద‌ర్  రెడ్డి ఈ మేర‌కు  తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. 

ఇదిలా ఉంటే కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి మరణ వార్త తెలియగానే అధికార య‌త్రాంగం అప్ర‌మ‌త్తం అయింది. దీంతో స‌ద‌రు కానిస్టేబుల్ ప‌నిచేసిన  కుల్సుంపురా పోలీసు స్టేషన్‌లోని సిబ్బందితో పాటు సీనియర్ అధికారులను క్వారంటైన్ చేశారు. అలాగే  రాష్ట్రంలోని  పోలీసు శాఖలో క‌రోనా సోకిన  మ‌రో ఆరుగురి ఆరోగ్య ప‌రిస్థితి గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.