వ‌రంగ‌ల్ లో దారుణం.. బావిలో న‌లుగురు వ‌ల‌స‌కూలీల మృత‌దేహ‌లు

వ‌రంగ‌ల్ లో దారుణం.. బావిలో న‌లుగురు వ‌ల‌స‌కూలీల మృత‌దేహ‌లు

 

లాక్ డౌన్ నేప‌థ్యంలో వ‌ల‌స‌జీవుల గోస‌లు గుండెల‌ను పిండేస్తున్నాయి. చేతిలో ప‌నుల్లేక‌‌, డ‌బ్బుల్లేక సొంతూళ్ళ‌కు ప‌య‌న‌మ‌వుతున్న వారు మధ్య‌లోనే ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. కొంద‌రు కాలిన‌డ‌క‌న వెళ్తూ ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంటే మ‌రికొంద‌రు వాహ‌నాల‌లో వెళ్తూ యాక్సిడెంట్ ల‌కు గురై బ‌ల‌వుతున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే  వ‌రంగ‌ల్ జిల్లాలో చోటుచేసుకోంది.
 
వరంగ‌ల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామం బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఓ గన్నీ సంచుల గోడౌన్‌ వద్ద ఉన్న బావిలో నలుగురి శవాలను గుర్తించగా.. మృతులను ఎండీ మక్సూద్‌(50), నిషా(45), బుస్ర (20), మూడేళ్ల మనవడిగా గుర్తించారు. 

వివరాల్లోకి వెళితే బెంగాల్‌కు చెందిన మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా వరంగల్ కు‌ వలస వచ్చాడు. వీరు గతేడాది డిసెంబరు నుంచి గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న గన్నీ సంచుల తయారీ గోడౌన్‌లో పనిచేస్తున్నారు. వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతంలో వీరు అద్దెకు ఉండేవారు. కానీ లాక్‌డౌన్ వల్ల ఇంటి నుంచి రావడానికి ఇబ్బందిగా ఉండటంతో, కొద్ది రోజుల నుంచి గోదాంలో ఉన్న రెండు గదుల్లోనే మక్సూద్ కుటుంబ స‌భ్యులు ఉంటున్నారు. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు సైతం గోడౌన్‌లోని మరో గదిలో ఉంటూ పని చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే గోడౌన్ యజమాని సంతోష్ ఆ చోటుకు వచ్చే సరికి పనిచేసే వారెవరూ కనిపించలేదు. దాంతో  ఆ ప్రాంగణం మొత్తం పరిశీలించిన య‌జమాని పాడుబడిన బావిలో నాలుగు మృతదేహాలను చూశాడు. వెంట‌నే  ఆయన గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృత‌దేహాల‌ను ప‌రిశీలించిన పోలీసులు వాటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ ఆ గోడౌన్ లో ఉంటున్న మక్సూద్ కుమారులు, మరో ఇద్దరు బిహార్ యువకులు కనిపించకపోవడం తీవ్ర‌ అనుమానాలను రేకెత్తిస్తోంది. దీంతో  ప్ర‌స్తుతం వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.