ఈ నెల నుంచి ఏపీలో ఉద్యోగుల‌కు ఫుల్ జీతాలు

ఈ నెల నుంచి ఏపీలో ఉద్యోగుల‌కు ఫుల్ జీతాలు

 

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే.. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు త‌మ ఆదాయాన్ని కోల్పోయాయి. ఖ‌జానాలో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. కొన్ని మిన‌హాయింపుల‌తో లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో ప‌రిస్థితులు కొంత మెరుగుప‌డ్డాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెల జీతాలు పూర్తిస్థాయిలో పడనున్నాయి. ఈ మేరకు ట్రెజరీ, ఫైనాన్స్ శాఖలకు సీఎంఓ నుంచి ఆదేశాలు అందాయి. ప్ర‌భుత్వ‌ నిర్ణయం నేపథ్యంలో ట్రెజరీ సాఫ్ట్ వేర్‌లో కొన్ని మార్పులు చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి సీఎఫ్ఎంఎస్‌లో మార్పులు అందుబాటులోకి రానున్నాయి. అయితే, మార్చి, ఏప్రిల్ నెలలో తగ్గించిన జీతాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిపోవడంతో ఉద్యోగుల జీతాలను కొంతమేర తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఉద్యోగుల స్థాయిని బట్టి వేతనాల్లో కోత పెట్టింది. అది పూర్తి స్థాయిలో కోత పెట్టడం కాదని, మళ్లీ చెల్లింపులు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 

ప్రస్తుతం లాక్ డౌన్ మినహాయింపులు వచ్చాయి. కొన్ని కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో పది రోజుల్లో రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరనుంది. ఈ  క్రమంలో ఈనెల జీతాలను పూర్తిస్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.