క‌రోనా పై పోరులో విజ‌యం సాధించిన గాంధీ ఆసుప‌త్రి వైద్యులు..

క‌రోనా పై పోరులో విజ‌యం సాధించిన  గాంధీ ఆసుప‌త్రి వైద్యులు..

 

క‌రోనాపై పోరులో గాంధీ ఆసుప‌త్రి వైద్యులు కీల‌క విజ‌యాన్ని అందుకుని చ‌రిత్ర సృష్టించారు. ఇందులో భాగంగా  హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం ప్లాస్మా థెరపీ చేయగా ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆ వ్య‌క్తి  డిశ్చార్ అయి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లనున్నాడు. దీంతో క‌రోనా తో ఆహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న వైద్యులు ప్లాస్మా చికిత్స స‌త్ఫ‌లితాన్ని ఇవ్వ‌డంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే గాంధీ ఆసుప‌త్రి వైద్యులు  ఇప్పటి వరకు నలుగురి నుంచి ప్లాస్మా సేకరించారు. ఒక్కో దాత నుంచి 400 ఎంఎల్‌ ప్లాస్మాను సేకరించి గాంధీ ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో మైనస్‌ 80 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్‌లో భద్రపర్చారు. మొదటి రోగికి చికిత్స అందించిన రెండ్రోజులకు మరో రోగికి కూడా ప్లాస్మా థెరపీ ఇచ్చారు. ఇప్పుడు అతనిలోనూ ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.

రోగ నిరోధక‌శక్తి తక్కువగా ఉన్న వారిలో వైరస్ నుంచి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వైరస్ తీవ్రంగా ప్రభావం చూపడంతో వారి ఆరోగ్యం సన్నగిల్లుతుంది. శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావం పడి, చివరకు ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీ చేయొచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.

అయితే ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారంటే.. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలు రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది.