హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నలివీ!

0
20
harish rao letter
టీడీపీతో కాంగ్రెస్‌ పెట్టుకుంటున్నది షరతులతో కూడిన పొత్తా, లేక షరం లేని పొత్తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని, ఆయనపై ఆధారపడే ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టినట్టేనని ఆరోపించారు. చంద్రబాబు ఏనాడూ తెలంగాణ పక్షపాతి కాదన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం వస్తే ఆయన ఎవరి పక్షాన నిలుస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నందుకు 2004లో కాంగ్రె్‌సతో, రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రానికి లేఖ రాస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసినందుకు 2009లో ఆ పార్టీతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని తెలిపారు. తెలంగాణ కోసమే షరతులతో కూడిన పొత్తులు పెట్టుకున్నామని, వాటిని ఉల్లంఘించినప్పుడు పొత్తులు తెగదెంపులు చేసుకున్నామని పేర్కొన్నారు. ఏకంగా రాష్ట్ర, కేంద్ర మంత్రివర్గాల నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి బోడకుంటి వెంకటేశ్వర్లు, తాజా మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, మదన్‌రెడ్డిలతో కలిసి టీఆర్‌ఎ్‌సఎల్పీలో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్‌ను ఉద్దేశించి 12 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిలబెట్టాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు పడగొట్టాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకోవడం సహజమేనని, కానీ.. వాటి వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు లబ్ధి చేకూరుతుందా? లేదా? అనేది ముఖ్యమని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా పొత్తులు పెట్టుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
హరీశ్‌రావు సంధించిన 12 ప్రశ్నలివీ!
1. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు చివరిదాకా ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఆ వైఖరిని మార్చుకున్నారా? భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడకుండా ఉంటారా? దీనిపై టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారా?
2. ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు, హైకోర్టు విభజన, కరెంటు, పోలవరం వంటి వివాదాల్లో చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వాదనలు చేస్తున్నారు. ఇకపై తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తానని ఆయన నుంచి కాంగ్రెస్‌ ఏమైనా హామీ తీసుకుందా? ఒప్పందం ఏమైనా చేసుకుందా? తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వేసిన కేసులను ఆయన ఉపసంహరించుకుంటారా?
3. కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసి పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను చంద్రబాబు లాక్కున్నారు. వాటిని తిరిగి ఇచ్చేయడానికి సిద్ధమా? ఇందుకు చంద్రబాబును ఒప్పించేలా కాంగ్రెస్‌ ఆయనతో అంగీకారం ఏమైనా కుదుర్చుకుందా?
4. పోలవరాన్ని 150 మీటర్ల ఎత్తులో కట్టి, 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో డ్యామ్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల భద్రాచలం రామాలయంతోపాటు తెలంగాణలోని లక్షల ఎకరాలు మునిగిపోతాయి. పోలవరం డిజైన్‌ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా?
5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతించవద్దని కేంద్రానికి వివిధ సంస్థలకుచంద్రబాబు 30 లేఖలు రాశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? అది చెప్పకుండా పొత్తుపెట్టుకుంటే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా?
6. కాళేశ్వరం, తుమ్మిడిహట్టి, సీతారామ, తుపాకులగూడెం, దేవాదుల, పెన్‌గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకోవడానికి చంద్రబాబు ఒప్పుకొన్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పగలరా?
7. పోలవరంతో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నందున.. నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు కృష్ణానదిలో 80 టీఎంసీల వాటా ఇవ్వాలని గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీలు వస్తాయి. కానీ నీళ్లు ఇవ్వబోమని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చంద్రబాబు కొర్రీలు పెట్టారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రజల కోసం 45 టీఎంసీల నీటిని కాంగ్రెస్‌ సాధించగలదా?
8. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు మిషన్‌ భగీరథను చేపడితే.. గోదావరి, కృష్ణా నదీ జలాలను వాడుకోవడం తప్పు అని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇది తప్పు అని ఆయన ఏమైనా పశ్చాత్తాపం వ్యక్తం చేశారా?
9. రూ.5 వేల కోట్ల విలువైన సీలేరు పవర్‌ ప్రాజెక్టును చంద్రబాబు లాక్కున్నారు. తెలంగాణకు ఏపీ ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టును తిరిగి ఇచ్చేస్తామని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా? నష్టపరిహారమైనా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందా?
10. ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్తు శాఖ ఉద్యోగులను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తే.. వారిని విధుల్లో చేర్చుకోకుండా ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. పనిచేయకున్నా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. వారిని విధుల్లో చేర్చుకుని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కేసులను ఉపసంహరించుకునేలా చేస్తారా?
11.. నిజాం కాలం నుంచి ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ వాదిస్తోంది. కోర్టుల్లో కేసులు వేసింది. వాటిలో ఏపీకి వాటా ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? కేసుల ఉపసంహరణకు ఒప్పుకున్నారా?
12.. ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో ఏపీ సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ వివాదాల పరిష్కారానికి సహకరిస్తానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?