లాక్‌డౌనే లేకుంటే

లాక్‌డౌనే  లేకుంటే

 

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించ‌డానికి దేశ‌వ్యాప్తంగా అర‌వై రోజుల నుంచి లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల స‌రి పోయింది. లేకుంటే ఇండియా తీవ్ర‌స్థాయిలో న‌ష్ట‌పోయి ఉండేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.   కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించకపోయింటే దాదాపు 29 లక్షల మంది వైరస్ బారినపడేవారని కేంద్రం తెలిపింది.

 కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా విధించిన‌ దేశవ్యాప్త లాక్‌డౌన్ వల్ల చాలా ప్రయోజనం చేకూరిందని కేంద్రం తెలిపింది. లాక్‌డౌన్ విధించకపోయింటే దేశంలో ఇప్పటి వరకు 14-29 లక్షల మంది వైరస్ బారినపడి.. వీరిలో 37,000-78,000 మంది ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంది.

లాక్‌డౌన్ మొదటి రెండు దశల విశ్లేషణల గురించి నీతి-ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకున్నాయని తెలిపారు. ఏప్రిల్ 03 నాటికి రోజుకు 22.6శాతం కొత్త కేసులతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కానీ, ఏప్రిల్ 4 తర్వాత కరోనా ఉద్ధృతి అమాంతం తగ్గి 5.5 శాతానికి చేరింది. మార్చి 25న సరైన సమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో వైరస్ వ్యాప్తిని గణనీయంగా అడ్డుకున్నాం.. అంతేకాదు, లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి నిలిచింది.. ఇదే సమయంలో వైద్య సౌకర్యాలు, ఔషధాలు, కోవిడ్-19 స్పెషాలిటీ ఆస్పత్రులుతో పాటు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం, వెంటిలేటర్లు సమకూర్చుకోవడం, పీపీఈ కిట్ల తయారీ లాంటి అత్యవసర కార్యక్రమాలకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

తయారీ పరంగా భారత్ అన్నింటికంటే చాలా ముందుందని వివరించారు. లాక్‌డౌన్ విధించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్- పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థికవేత్తలు, పరిశోధకులు రూపొందించిన నివేదికలను తెలియజేశారు. బీసీసీ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్ కారణంగా 36 నుంచి 70 లక్షల కేసులు, 1.2-2.1 లక్షల మరణాలు నివారించగలిగారని తెలిపింది. 

పీహెచ్‌ఎఫ్‌ఐ నివేదిక 78,000 మరణాలను నివారించినట్లు అంచనా వేసింది. అలాగే ఆర్థికవేత్తల నివేదిక ప్రకారం.. 23 లక్షల కేసులు, 68,000 మరణాలు.. రిటైర్డ్ శాస్త్రవేత్తలు, ఎపిడిమియాలజిస్ట్‌ల అంచనా ప్రకారం.. 15.9 లక్షల కేసులు, 51,000 మరణాలను నివారించగలిగారు. 20 లక్షల కేసులు, 54,000 మరణాలు నివారించగలిగామని గణాంక శాఖ, ఐఎస్ఐ నివేదిక తెలిపింది. లాక్‌డౌన్ పెద్ద సంఖ్యలో మరణాలు, పాజిటివ్ కేసులను అడ్డుకోగలిగిందని, తక్కువ మందికి వైరస్ సోకిందని డాక్టర్ పాల్ చెప్పారు.