లాక్ డౌన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ..

లాక్ డౌన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి  1897లో రూపొందించిన అంటువ్యాధుల చట్టంలోని సెక్షన్ 234 ప్రకారం కఠినమైన నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో అప్పుడెప్పుడో 124 ఏళ్ల క్రితం తయారు చేసిన చట్టంలో దీనికి సంబంధించి ఏం చెప్పి ఉంది? అసలు ఈ లాక్ డౌన్ ఏంటి ? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 గాలి ద్వారా లేదా మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసర సేవలు  మినహా అన్ని వ్యవస్థల్ని దిగ్బంధించే ప్రయత్నాన్నే లాక్ డౌన్ గా వ్యవహరిస్తారు. ఈ సమయంలో ప్రజా రవాణాను నిలిపివేస్తారు. టాక్సీలు, ఆటోలు తిరగనివ్వరు. అత్యవసర రవాణాకు మాత్రం అనుమతులు ఇస్తారు.  పోలీసు వాహనాలతో పాటు మీడియా వాహనాలకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నిత్యవసర వస్తువుల కేటగిరిలో రాని దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్సులు, ఆఫీసులు ఫ్యాక్టరీలను మూసివేస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా జిల్లా కలెక్టర్ ఇచ్చే నోటిఫికేషన్ కు కట్టుబడి ఇంట్లోనే ఉండాల్సి ఉండగా వీరిపై పోలీసుల నిఘా ఎప్పుడు  ఉంటుంది.

ఈ లాక్ డౌన్ లో భాగంగా ప్రజలు  అత్యవసరం అయితే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఒకవేళ బయటకు వస్తే ఇతర వ్యక్తులతో కనీస దూరాన్ని మెయింటెన్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి చేరి ఉండటంపై ఆంక్షలు ఉంటాయి. ప్రజలకు అవసరమైన  నిత్యవసర వస్తువుల ధరల్ని, మందుల ధరల్ని ప్రభుత్వం  ప్రకటించి, ఎప్పటికప్పుడు వాటిని అమలు చేయటంతో పాటు వాటిని పర్యవేక్షిస్తుంటారు. ఈ లాక్  డౌన్ లో భాగంగా  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వంద పడకల సామర్థ్యం ఉన్న క్వారంటైన్ కేంద్రాల్ని ప్రభుత్వం నెలకొల్పి ప్రజలకు బాసటగా నిలుస్తుంది.