చిరంజీవి కోరినట్టే చేసిన జగన్

చిరంజీవి కోరినట్టే చేసిన జగన్

 

మెగాస్టార్ చిరంజీవి, సీఎం వైఎస్ జగన్. ఒకప్పుడు వీరిద్దరూ వేర్వేరు ధృవాలు. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృష్టితో సినీ వినీలాకాశంలో రారాజుగా ఎదిగిన  హీరో. వైఎస్ జగన్ ఒంటి చేత్తో సొంత పార్టీ పెట్టి ఢిల్లీ పెద్దలనే ధిక్కరించిన పొలిటికల్ హీరో. చిరంజీవి సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ పెట్టిన నాయకుడు. జగన్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి సినిమాల్లో కూడా చూడని ప్రత్యేక పరిస్థితుల్లో సొంత పార్టీ పెట్టిన నాయకుడు. చిరంజీవి కులం వేరు. జగన్ కులం వేరు. చిరంజీవి పార్టీ వేరు. జగన్ పార్టీ వేరు. చిరంజీవి నేపథ్యం వేరు. వైఎస్ జగన్ నేపథ్యం వేరు. అలాంటి భిన్న ధృవాలిప్పుడు ఏకతాటిపైకి వచ్చాయి. 

ఒకప్పుడు ఏ చిరంజీవి పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిందో... ఇప్పుడు అదే చిరంజీవి అదే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. అలాంటి చిరంజీవి, వైఎస్ జగన్ ల మధ్య ఇటీవల జరిగిన ఓ నిర్ణయం ఇప్పుడు అటు సినీ రంగాన్ని, ఇటు రాజకీయ రంగాన్ని కూడా కుదిపేస్తోంది. చిరంజీవి మాటను గౌరవించినందుకు జగన్ ను చిరంజీవి అభినందిస్తుంటే... చిరంజీవి తను చేస్తున్న మంచికి మద్దతిస్తున్నందుకు జగన్ చిరంజీవిని అభినందిస్తున్నారు. రెండు శక్తులు ఇప్పుడు ఒక్కటే తాటిపైకి వచ్చాయి. 

చిరంజీవి ఇటీవల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మళ్లీ పాత మెగాస్టార్ చిరంజీవి అయిపోయారు. పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. సినిమ రంగానికే పెద్ద దిక్కుగా అయ్యారు. అలాంటి చిరంజీవి కోరారని ఏపీ సీఎం జగన్ సినిమా రంగానికి దేశంలో ఎక్కడా లేని పెద్ద మేలు చేశారు. సినిమా నటుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సినీ రంగానికి అంత మేలు జరగలేదు. కానీ కేవలం చిరంజీవి అడిగారన్న ఒకే ఒక్క కారణంతో జగన్ ఆ పనిచేశారు. అదేంటో తెలుసా.... ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సినిమా షూటింగ్ లు, టీవీ షూటింగ్ లన్నీ ఉచితంగా చేసుకోవచ్చని జగన్ జీవో జారీ చేశారు. 

రాష్ట్రంలో ఎక్కడైనా సరే సినిమా, టీవీ షూటింగ్ లు ఫ్రీ. ఒక్క రూపాయి కూడా ఫీజు లేదని సీఎం జగన్ జీవో నెంబర్ 45 ను జారీ చేశారు. ఈనెల 19న విడుదలైన ఈ జీవోను కేవలం మెగాస్టార్ చిరంజీవి కోరిన కోరిక మేరకు విడుదల చేసినట్టు జగన్ సీఎం కార్యాలయం అధికారుల దగ్గర చెప్పారు. కొన్నాళ్ల కిందట చిరంజీవి సతీ సమేతంగా వచ్చి సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఓడిపోయినా, జగన్ ని ఎప్పటికీ సీఎం కానివ్వను ఇది శాసనమని వాగ్ధానం చేసినా, రాజకీయంగా తమ్ముడు పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ల మధ్య ఎన్ని విభేదాలున్నా చిరంజీవి వాటన్నింటినీ లెక్కచేయలేదు.

పెద్దరికంగా ఆలోచించి గొప్ప మెజారిటీతో విజయం సాధించిన సీఎం జగన్ ని అభినందించారు. అంతేకాదు అప్పటికే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం, దిశా చట్టం వంటి సంచలనమైన చట్టాలు చేయడంతో చిరంజీవి జగన్ పాలనకు ఫిదా అయిపోయారు. ఆ నేపథ్యంలో చిరంజీవి, జగన్ కుటుంబాల మధ్య మర్యాదపూర్వక భేటీ అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ సందర్భంగా చిరంజీవి, వైఎస్ జగన్ ల మధ్య ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదు. చిరంజీవి కేవలం సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారాన్ని అందించాలని సీఎం జగన్ ను కోరారు. సీఎం జగన్ కూడా ఏపీకి సినిమా ఇండస్ట్రీని రప్పించేలా చూడండని, సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా తానివ్వడానికి సిద్ధమని జగన్ హామీ ఇచ్చారు.

చిరంజీవి నే లీడ్ తీసుకుని ఎప్పుడు ఏం కావాలన్నా నా దగ్గరకు వచ్చి చేయించుకోవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో ఏపీలో షూటింగ్ లకు ఇబ్బందులు లేకుండా, ఉచితంగా చేసుకునేలా అవకాశం ఇవ్వాలని చిరంజీవి కోరారట. దాంతో చిరంజీవి చెప్పిన దానికి వెంటనే జగన్ ఓకే అన్నారు. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని గతంలో మా సమావేశంలో కూడా జగన్ ఎంత బాగా స్పందించారో బహిరంగంగానే చెప్పారు. తర్వాత లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో ఆ నిర్ణయం పెండింగ్ లో పడింది.

అయితే ఇటీవల సీఎం జగన్ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని చిరంజీవన్న అడిగిన పని ఏమైందని అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఆ ఫైల్ సిద్ధం చేసి సీఎం జగన్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. దాంతో వెంటనే సీఎం సంతకం చేసి, తక్షణమే ఉచితంగా షూటింగ్ లకు అనుమతినివ్వాలని ఆదేశించారు. ఆ మేరకు ఈనెల 19న జీవో నెంబర్ 45 విడుదలైంది. దాంతో సీఎం జగన్ కు సినిమా పరిశ్రమ మొత్తం కృతజ్ఞ‌త‌ తెలుపుతోంది. సీఎం జగన్, చిరంజీవిల మధ్య ఎంత సన్నిహిత సంబంధాలున్నాయో చెప్పడానికి ఈ జీవోనే ఉదాహరణ అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.