పార్టీ కోసం ఫ్యామిలీనే కాదన్న జగన్

పార్టీ కోసం ఫ్యామిలీనే కాదన్న జగన్

రాజకీయాల్లో రోటీన్ కి భిన్నంగా ఆలోచించే అతిముఖ్యమైన నాయకుల్లో వైఎస్ జగన్ ఒకరు. రాజకీయ పార్టీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు దేశంలో ఎవ్వరూ తీసుకోని నిర్ణయాలను జగన్ తీసుకున్నారు. భారతదేశంలోనే సంచలనమైన రాజకీయ నిర్ణయాలు తీసుకునే వాళ్ల లిస్ట్ తయారు చేస్తే అందులో జగన్ పేరే ముందుంటుంది. అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే సీఎం జగన్ అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ లో 60 శాతం మంది ఎస్సీఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రిపదవులివ్వడం, ఐదుగురు డిప్యూటీ సీఎంలను నీయమించడం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలకు , మహిళలకు ఇవ్వడం వంటిని జగన్ కే సాధ్యమయ్యాయి. ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ రాజకీయ చరిత్రను జగన్ ఒక్కసారిగా తిరగరాసేశారు. ఇప్పుడు వీటన్నింటిని మించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబం కంటే కూడా పార్టీనే గొప్ప అనే సందేశాన్ని తన కార్యకర్తలకు, ప్రజలకు పంపాలని నిర్ణయించారు. 


తన రాజకీయ నిబద్ధత ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా నిలవాలని భావించారు. ఇందుకోసం తన కుటుంబానికి పదవులు ఇవ్వకూడదని నిర్ణయించారు.  బంధుప్రీతికి ఎటువంటి తావూ లేకుండా పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ కార్యకర్తల కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క పదవి కూడా ఆయన కుటుంబ సభ్యులకు కానీ, సమీప బంధువులకు కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో గెలిచిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మినహా మరెవ్వరికీ పదవులు దక్కలేదు. వాళ్లిద్దరు కూడా అప్పటికే అక్కడ సిట్టింగ్ ప్రజాప్రతినిధులు. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా సరే ఒక్కరికి కూడా జగన్ ఎమ్మెల్సీ పదవి కానీ, రాజ్యసభకానీ, నామినేటెడ్ పదవి కానీ కనీసం మున్సిపల్ ఛైర్మన్ లాంటి పదవులు కూడా ఇవ్వలేదు. ఇకపై ఇవ్వకూడదని కూడా నిర్ణయించారు. 


ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఇదే విషయాన్ని తన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి విషయంలో కూడా అమలు చేశారు. పదేళ్లుగా పార్టీలో ఉన్నా, తన సొంత చిన్నాన్నే అయినా,  రాజ్యసభ సీటు కోసం ఎంత ప్రయత్నించినా జగన్ ఇవ్వలేదు.  ఒంగోలు ఎంపీ సీటు త్యాగం చేసినందుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు అంతే. ఇక ఇటీవల పులివెందుల నియోజకవర్గంలో కూడా తన చిన్నాన్నల కుటుంబాలకు ఎలాంటి పదవి ఇవ్వలేదు.  పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ పదవిని స్వయంగా జగన్ చిన్నాన్న కుటుంబ సభ్యులే కోరినా అక్కడ బీసీలను మున్సిపల్ ఛైర్మన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం స్వయంగా సీఎం జగనే పులివెందుల మున్సిపాలిటీ ఛైర్మన్ రిజర్వేషన్ ను బీసీ చేయడానికి అంగీకారం తెలిపారు. 


తన పార్టీ కోసం కష్టపడ్డ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు కూడా ఎలాంటి పదవులు కోరుకోలేదు. వారు కోరితే జగన్ ఇచ్చేవారేమో కానీ మొత్తం కుటుంబం అంతా పార్టీని నమ్మకున్న నాయకులకు, కార్యకర్తలకు ముందు న్యాయం చేయాలని భావించారు. దీంతో జగన్ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని అమలు చేయగలుగుతున్నారు. ఫ్యామిలీ కంటే పార్టీ కార్యకర్తలే తనకు ప్రాధాన్యమన్న సందేశాన్నిచ్చి క్యాడర్ లో జగన్ పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.