
ఒక తండ్రి తన కొడుకు పెళ్ళి కోసం డబ్బు తెస్తానంటూ వెళ్ళాడు.. ఎన్ని రోజులు ఎదురుచూసినా రాకపోవడంతో చనిపోయాడు అనుకున్నారు అంతా.. కానీ 3 సంవత్సరాల తరువాత కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తున్నప్పుడు.. ప్రపంచం అంతా లాక్ డౌన్ లో ఉండగా.. చనిపోయాడనుకున్న తండ్రి బ్రతికే ఉన్నడంటే ఆ ఆనందం మాటలకందదు.. అలాంటి సంఘటన ఒకటి ఈ లాక్డౌన్ టైంలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరమ్ సింగ్(70) అనే వ్యక్తి... కుమారుడి పెళ్లి కోసం డబ్బు తెస్తానని మూడేళ్ల క్రితం ఇంటి నుంచి బయలు దేరి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాలేదు. చాలా రోజులు వేచి చూసి చనిపోయాడేమో అనుకున్నారు.
కానీ, తెలీకుండా బెంగళూరు రైలెక్కిన కరమ్ సింగ్ కర్ణాటకలోని మైసూరుకు చేరాడు. ఆ జర్నీ వల్ల అతడిలో టెన్షన్ పెరిగి.. గతాన్ని మర్చిపోయాడు. మైసూరు వీధుల్లో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగించాడు. అయితే, లాక్డౌన్ విధించడంతో అతడ్ని ఓల్డేజ్ హోమ్‌కు తరలించి చికిత్స అందించారు. ఆ చికిత్స వల్ల కోలుకున్న అతడికి గతం గుర్తుకువచ్చింది. తాను అనాథను కాదని, తనకు ఇల్లు ఉందని చెప్పాడు.
ఆ వివరాలను బట్టి పోలీసులు ఉత్తరప్రదేశ్ అధికారులను సంప్రదించగా.. వాళ్లు కరమ్ సింగ్ కుటుంబాన్ని సంప్రదించారు. దీంతో.. అతడు తమ తండ్రేనని చెప్పారు. తమ తండ్రిని తమకు అప్పగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కరమ్ సింగ్‌ను యూపీకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.