ఎమ్మెల్యే బావకి కరోనా పాజిటివ్

ఎమ్మెల్యే బావకి కరోనా పాజిటివ్

 

ఎంత నియంత్రిస్తున్నా ఏపీలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతునే ఉంది. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించినప్పటికీ గతంలో విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. 

ఇప్పటికే సుమారు 29 వేల మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చారు. చైనా, అమెరికా, లండన్, ఇండోనేషియా, దుబాయ్ వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రానికి తెలుగువాళ్లు తిరిగొచ్చారు. వీరిని ఐసోలేషన్ లో పెడుతున్నారు. వీరి వలన వైరస్ వ్యాపించే ప్రమాదముందని ప్రభుత్వం వీరిని హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్ లలో ఉంచుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఈ సమస్య పెరుగుతూనే ఉంది. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యే బావకే ఇప్పుడు కరోనా పాజిటివ్ రావడం ఏపీలో చర్చనీయాంశమైంది. 

ఏపీలో మొత్తం 10 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. అందులో విశాఖలో మూడుండగా, గుంటూరు లో ఒక కేసు నమోదైంది. గుంటూరు లో 52 ఏళ్ల వయసున్న వ్యక్తికి కరోనా సోకింది. ఈయన ఢిల్లీ కి ఇటీవల మతపరమైన సమావేశానికి హాజరయ్యారు. అక్కడ నుంచి దురంతో ఎక్స్ ప్రెస్ లో విజయవాడకు వచ్చారు. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లారు. అయితే ఇంట్లో రెండు రోజులుండి ఓ ఫంక్షన్ కూడా చేశారట. తరువాత ఈ వ్యక్తికి ఫీవర్ రావడంతో ఆస్పత్రిలో చేరితే కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. 

ఈయన గుంటూరులో ఓ ఎమ్మెల్యేకి స్వయంగా బావ కావడం విశేషం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎంతటి పెద్ద వాళ్లకైనా కరోనా వస్తుందనడానికి ఈ కేసే ఉదాహరణ. అందుకే ఏపీ ప్రభుత్వం రైతు బజార్లు, నిత్యవసర వస్తువుల కేంద్రాల్లో కూడా 3 మీటర్ల సోషల్ డిస్టెన్స్ ని అమలు చేస్తోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా తన సమీక్షల్లోనూ, ప్రెస్ మీట్లలోనూ సోషల్ డిస్టెన్స్ అమలు చేస్తున్నారు.