ప్రాణాల‌తోనే బావిలోకి

ప్రాణాల‌తోనే బావిలోకి

 

తొమ్మిది శ‌వాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన వ‌రంగ‌ల్ జిల్లా గొర్రెకుంట బావి మిస్ట‌రీని ఛేధించ‌డానికి పోలీసులు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్ర‌య‌త్నంలో వారికో చిన్న క్లూ పోస్ట్‌మార్టం రూపంలో ల‌భించింది. బావిలో శ‌వాలుగా తేలిన ఆ తొమ్మిది మంది ప్రాణ‌ముండ‌గానే నీటిలో ప‌డి చ‌నిపోయిన‌ట్టు పోస్టుమార్టం ప్రాథ‌మిక నివేదిక‌లో వెల్ల‌డ‌యింది. దీంతో పోలీసులు మ‌క్సూద్ కుటుంబానికి, మిగిలిన వ్య‌క్తుల‌పై విష ప్ర‌యోగం జ‌రిగిందా? లేదంటే వారిపై మ‌త్తుమందు ప్ర‌యోగించారా అనే కోణాల్లో ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. 

ఈ కేసులో షకీల్, యాకూబ్ ల మొబైల్ ఫోన్లే కీలకం కానున్నాయి. కాల్ డేటా ఆధారంగా వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మక్సూద్ కూతురు బూస్రాకు ఉన్న అక్రమ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో సీపీ సమావేశమయ్యారు. 

తొమ్మిది మంది మృతి మిస్టరీని చేధించేందుకు పోలీసులు అన్ని దారుల్లో విచారణ తీవ్రతరం చేశారు. కేసులో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్, మక్సూర్ కూతురు బుస్రా ఖాతూన్‌తో‌‌ వివాహేతర సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఘటనలో షకీల్ సెల్‌ఫోన్‌పై దృష్టి సారించిన పోలీసులు కాల్ డేటాను సేకరిస్తున్నారు.  

బుస్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానం ఉన్న మిద్దెపాక యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురి సెల్‌ఫోన్ల ఆచూకీపై టెన్షన్ నెలకొంది. మృతుల ఫోన్ నంబర్లను పోలీసులు ప్రకటించారు. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత సెల్‌ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఆధారాలు లభించలేదు. మిస్టరీగా మారిన ఈ ఘటనలో సెల్ ఫోన్లే  కీలకం కానున్నాయి. ఆ దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.