కూకట్‌పల్లితో నాకు అనుబంధం ఉంది : నందమూరి సుహాసిని

0
250
Nandamuri suhasini campaining

నందమూరి సుహాసిని కూకట్‌పల్లి తెదేపా నియోజకవర్గ అభ్యర్థిగా పర్యటనకు శ్రీకారం చుట్టారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందడి శ్రీనివాసరావుతో కలిసి నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్నారు. మొదట కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లోని మందడి శ్రీనివాసరావు నివాసంలో తెదేపా ముఖ్య నేతలు, మాజీ కార్పొరేటర్లతో ఆమె సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, క్యాడర్‌, అభిమానులను ఏకంచేసే అంశంపై చర్చించారు. అనంతరం నేతలతో కలిసి కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసిన మాజీ కార్పొరేటర్‌ గొట్టిముక్కల వెంగళరావు నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. తమతో కలిసిరావాలని చెప్పారు. అధిష్టానంతో మాట్లాడి నామినేషన్‌ ఉపసంహరణపై నిర్ణయం వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మందడి శ్రీనివాసరావుతో కలిసి మోతీనగర్‌లోని ముఖ్య నేతలను ఆమె కలిశారు.
కూకట్‌పల్లితో నాకు అనుబంధం ఉంది’.. కేపీహెచ్‌బీకాలనీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన సుహాసిని పలు విషయాలను వెల్లడించారు. మిత్రులు, బంధువులు ఉండడంతో కూకట్‌పల్లితో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడికి తరచూ వచ్చేదాన్నని అన్నారు. నామినేషన్‌ వేసిన తర్వాత వివిధ వర్గాల వారితో మాట్లాడుతున్నామని, అందరి మద్దతు పొంది భారీ మెజార్టీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20వతేదీ నుంచి నియోజకవర్గంలో ఓల్డ్‌బోయిన్‌పల్లి నుంచి సుహాసిని ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందడి శ్రీనివాసరావు చెప్పారు. నందమూరి కుటుంబసభ్యులంతా తనవెంటే ఉన్నారని, త్వరలోనే వారు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.