నెట్ ఫ్లిక్స్ 100 మిలియన్ డాలర్ల సాయం

నెట్ ఫ్లిక్స్ ఉదారత

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలన్ని దాదాపు గృహ నిర్బంధం లోకి వెళిపోయాయి. తెలుగు రాష్ట్రాలు సైతం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ను ప్రకటించాయి. లాక్ డౌన్ లో ఉపాధిని కోల్పోతున్న సామాన్య జనానికి ప్రభుత్వం చేయూతగా బియ్యం, నగదు ప్రోత్సహకాన్ని అందించనుంది. ఈ లాక్ డౌన్ లో భాగంగా చిత్ర పరిశ్రమ కూడా ఆగిపోనుంది. ఈ పెను విపత్తు వల్ల రోజువారి కూలీపై ఆధారపడే సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వారిని ఆదుకునేందుకు అటు ప్రభుత్వంగానీ ఇటు సినీ పెద్దలు కానీ ఎవరూ స్పందించలేదు.

ఇదిలా ఉంటే ఈ విషయం పై  టాలీవుడ్  హీరో రాజశేఖర్ స్పందించాడు. లాక్ డౌన్ లో భాగంగా  ఉపాధి కోల్పోయి తిండికి లేని ఆర్టిస్టులకు సాయం అందిస్తానని తెలిపారు. ఈ విపత్తుపై మునుముందు అగ్ర హీరోలు కూడా  స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే డిజిటల్ రంగంలో అతి పెద్ద ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సైతం తన ఔదార్యాన్ని చాటుకుంది. కరోనా వల్ల ఆగిపోయిన సినిమా, టీవీ రంగాల కార్మికులను ఆదుకుంటామని ప్రకటన విడుదల చేసింది. అందుకోసం దాదాపు వంద మిలియన్ డాలర్లని(సుమారు765కోట్లు) కేటాయించినట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ కోసం పనిచేసే టీవీ, సినిమా రంగానికి చెందిన కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు. అందులో పదిహేను మిలియన్ డాలర్లని ఇప్పటికే ఎమెర్జెన్సీ ఫండ్ గా విడుదల చేసింది.

నెట్ ఫ్లిక్స్ మాదిరిగానే అమెజాన్ వంటి డిజిటల్ దిగ్గజాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సినీ పెద్దలు, ప్రముఖ డిజిటల్ దిగ్గజ కంపెనీలు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్లన  సినీ కార్మికులు కాస్తయినా ఊపిరిపీల్చుకుంటారని అందరూ భావిస్తున్నారు.