భార‌త్ లోని పంట‌ల‌ను నాశ‌నం చేస్తోన్న పాక్ మిడ‌తల దండు

భార‌త్ లోని పంట‌ల‌ను నాశ‌నం చేస్తోన్న పాక్ మిడ‌తల దండు

 

శ‌త్రుదేశం పాకిస్థాన్ తో భార‌త్ నిరంత‌రం పోరాడుతూనే ఉంటుంది. ఎప్పుడూ స‌రిహ‌ద్దు త‌గాదాలు, క‌శ్మీర్ వ్య‌వ‌హారాల వ‌ల్ల ఈ రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. అయితే ఇప్పుడు మ‌రో వ్య‌వ‌హారం రెండు దేశాల మ‌ధ్య పెద్ద దుమారం రేపే విధంగా ఉంది. పాకిస్థాన్ నుంచి కోట్లాది మిడతలు భారత భూభాగంపైకి దండెత్తి వస్తున్నాయి. నల్లటి మేఘంలా విరుచుకుపడుతున్న మిడతల దండు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో పంటల్ని నాశనం చేస్తున్నాయి. 

మధ్యప్రదేశ్‌లోకి కూడా ప్రవేశించిన ఈ మిడతల దండు.. పత్తి, కూరగాయలతో పాటు ఇతర పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. పాకిస్థాన్‌ నుంచి వస్తోన్న మిడతల వల్ల రాజస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వాస్తవానికి ఏటా జూన్-జూలై నెలల్లో మిడతల దండు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుంది. కానీ ఈ సారి ముందుగానే రావడంతో పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ మిడతల దండు మధ్యప్రదేశ్‌లోని 15 జిల్లాల్లోకి కూడా ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది.

మిడత వల్ల గతేడాది రాజస్థాన్‌లో 6.7 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మిడతల వల్ల 2019లో వెయ్యి కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లిందని రాజస్థాన్ ప్రభుత్వం అంచనా వేసింది. మిడతల దండును కట్టడి చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోన్న రాజస్థాన్.. ఈ కీటకాలను నియంత్రించండానికి డ్రోన్లను సమకూర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. జైపూర్‌ను దాటేసిన మిడతల దండు ఢిల్లీ దిశగా వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.