మీ పిల్లల్ని పాస్ చేశాం... జగన్ సంచలన నిర్ణయం

మీ పిల్లల్ని పాస్ చేశాం... జగన్ సంచలన నిర్ణయం

 

విపత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో  పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులకు పోషక విలువలతో కూడిన జగనన్న గోరుముద్ద పథకాన్ని అందించడం, పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. దీంతో జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. 

పిల్లలు మళ్లీ జూన్ వరకు స్కూళ్లకు రాకుండా ఉండేలా ఆరవ తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పాస్ చేసి తరువాతి క్లాస్ లకు పంపేయాలని ఆదేశించారు. ఇది విపత్కరమైన పరిస్థితి కనుక ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని జగన్ ప్రకటించారు. 

మరో వైపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు చక్కటి మెనూతో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది పిల్లలకు ఈ గోరుముద్ద పథకం ద్వారా ప్రతీ రోజూ మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. ఇప్పుడున్న లాక్ డౌన్ లో అది సాధ్యం కాదు కనుక నేరుగా ప్రతీ విద్యార్థి ఇంటికీ గోరుముద్ద పథకం కింద రేషన్ ని సరఫరా చేయాలని నిర్ణయించారు. 

ఇంటిదగ్గర తల్లి తమ పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని వండి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల ద్వారా ప్రతీ పిల్లాడి ఇంటికి వెళ్లి పౌష్టికాహారం అందించనున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా పేద పిల్లలకోసం సీఎం వైఎస్ జగన్ ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.