విశాఖపట్నం ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలు

0
124
Private Hospitals nuisance in vishakapatnam

విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఆదాయమే లక్ష్యంగా రోగులను, వారి బంధువులను కష్టాలకు గురి చేస్తున్నారు.మృతురాలి తల్లి, భర్త, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సీపట్నం సమీప రోలుగుంట మండలం, రాజన్నపేట గ్రామానికి చెందిన నమ్మి లోవ (30)ను అనారోగ్యంతో ఈ నెల 22న సాయత్రం 5 గంటల ప్రాంతంలో ఆదిత్య మల్టీకేర్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మరణించింది.

అయితే రూ.62వేలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని, చెల్లించకపోతే మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఖరాఖండీగా తేల్చి చెప్పేశారు. అంతటితో ఆగకుండా అదే గదిలో లోవ బంధువులను నిర్బంధించారు. డబ్బు కడితేగానీ బయటకు పంపేదిలేదని చెప్పడంతో వీరంతా హతాశులయ్యారు. రెక్కాడితేకాని డొక్కాడని, అక్షరం ముక్క రాని తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. అనంతరం రూ.20 వేలు చెల్లించిన తరువాతనే గదిలో నిర్బంధించి ఉన్న వారిని బయటకు పంపారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రూ.65 వేలు చెల్లించామని చెప్పారు. తమ వద్ద డబ్బు లేదని, మృతదేహాన్ని ఇస్తే తమ ఊరు వెళ్లిపోతామని బాధితులు విలపిస్తున్నారు.

మృతదేహం ఇవ్వమంటున్నారు
ఆస్పత్రిలో చేర్పించినప్పుడు జ్వరంతో ఉందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని వైద్యులు చెప్పారు. ఐదు రోజులు వైద్యం అందించి ఇప్పుడు చనిపోయిందని చెబుతున్నారు. నా కూతురి మరణంతో ఇద్దరు బిడ్డలు తల్లిలేని వారయ్యారు. ఆస్పత్రికి చెల్లించిన డబ్బుతో పాటు ఇంకా చెల్లించాలని, లేకపోతే మృతదేహాన్ని ఇవ్వమని చెబుతున్నారు.