మరో 60 రోజులు గడువు కోరిన ఆర్‌కామ్‌

0
130
rcom seeks 60 days more

స్వీడన్‌కు చెందిన టెలికాం సంస్థ ఎరిక్సన్‌తో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రూ.550 కోట్లు చెల్లిస్తానన్న ఆర్‌కామ్‌.. ఆ గడువును మరో 60 రోజులు పెంచాలని సుప్రీంకోర్టును కోరింది. నిధుల సమీకరణకు స్పెక్ట్రమ్‌ అమ్మకం ఇంకా పూర్తి కాలేదని.. ఎరిక్సన్‌ బకాయిలను చెల్లించేందుకు మరో 60 రోజుల గడువు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇది ఈ నెల 4న విచారణకు రానున్నట్లు ఆర్‌కామ్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. స్పెక్ట్రమ్‌ అమ్మకానికి అనుమతించాలని కోరుతూ టెలీకమ్యూనిషన్స్‌ విభాగానికి ఆగస్టు 7న దరఖాస్తు చేసుకున్నట్లు అందులో పేర్కొంది. తమకు చెల్లిస్తానన్న రూ.550 కోట్లు గడువులోపు చెల్లించడంలో విఫలమయ్యారని ఎరిక్సన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దేశంలో ఏడేళ్ల కాలానికి గానూ తన నెట్‌వర్స్‌ నిర్వహణ కోసం ఆర్‌కామ్ సంస్థ 2014లో ఎరిక్సన్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2016 నుంచి బకాయిలు చెల్లించలేదు. దీంతో గతేడాది సెప్టెంబరులో ఎరిక్సన్‌ సంస్థ నేషనల్‌ కంపెనీ లా అథారిటీ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించింది. ఆర్‌కామ్‌ నుంచి రావాల్సిన బకాయిలు రూ.900 కోట్ల పైచిలుకు ఉండగా.. వడ్డీతో కలిపి రూ.1600 కోట్లు అయ్యాయని ఎరిక్సన్‌ తరపు ప్రతినిధి న్యాయస్థానం ముందు వివరించారు. అయితే రూ.550 కోట్లు మాత్రమే చెల్లించి వివాదాన్ని పరిష్కరించుకుంటామని ఆర్‌కామ్‌ కోర్టుకు తెలిపింది. పాత సెటిల్‌మెంట్‌ ప్రకారం సెప్టెంబరు 30 లోపు రూ.550 కోట్లను ఎరిక్సన్‌కు చెల్లించాల్సి ఉంది.