అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్

0
241
revanth reddy arrested

రేవంత్ సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రేవంత్ అనుచరులు యూసుఫ్, ప్రశాంత్, రెడ్డి శ్రీనివాస్, సత్యపాల్, వెంకట్‌రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కొడంగల్‌లో కేసీఆర్ సభను అడ్డుకోవాలంటూ రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి తొలుత రేవంత్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని ప్రకటించిన పోలీసులు.. ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ రేవంత్‌ను అరెస్ట్ చేసారు. దాంతో ఆయన కుటుంబీకులు, వర్గీయుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.ఆనంతరం రేవంత్‌ను జడ్చర్ల ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది. కోస్గి, కొడంగల్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించడంతో పాటు భారీగా బలగాలను మోహరించారు.

పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని గీత కోరారు. రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. రేవంత్‌ అరెస్ట్‌కి ముందు అతని నివాసం వద్ద 100 మందికి పైగా పోలీసులు మోహరించారు.ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. మరోవైపు బొంరాస్‌పేట మండలంలోనూ పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ మండలానికి చెందిన 9 మంది కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.