సంచయిత ఒంటరి పోరాటం..

సంచయిత ఒంటరి పోరాటం..

 

ఏపీ సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకుని మరీ పెద్ద పదవిచ్చారంటే వాళ్లు ఎలాంటి వాళ్ళు అయుంటారో కాస్త అవగాహనకు రావొచ్చు. ఇప్పుడు మాన్సాస్ , సింహాచలం దేవస్థానం ఛైర్ పర్సన్ గా జగన్ నియమించిన సంచయిత నిజంగానే అలానే ఉన్నారు. సంచయిత గజపతిరాజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమైన పేరు. ఎందుకంటే చరిత్రను తిరగరాసింది. 

గజపతిరాజుల వంశంలో ఎవ్వరికీ దక్కని అవకాశం దక్కించుకుంది. మాన్సాస్, సింహాచలం ట్రస్టుల అనువంశిక వారసత్వాన్ని దక్కించుకున్న మొట్టమొదటి మహిళ ఈ సంచయిత. ఇప్పుడు ఆమె ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. అదెవరిమీదో కాదు. స్వయాన చిన్నాన్న అశోక్ గజపతిరాజు కుంటుంబంతో ఆమె పోరాడుతున్నారు.

సంచయిత ను సీఎం జగన్ రాత్రికి రాత్రి జీవో ఇచ్చి తెల్లారేసరికి లక్షల కోట్ల ఆస్తులున్న మాన్సాస్ ట్రస్ట్ కి ఛైర్ పర్సన్ ని చేశారు. అంతేకాదు ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన సింహాచలం దేవస్థానం పాలకమండలికి ఛైర్ పర్సన్ ని కూడా చేసేశారు. అయితే సంచయిత బాధ్యతలు తీసుకున్న వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు, సంచయిత సొంత కుటుంబ సభ్యులు ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 

సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు సోదరుడైన అశోక్ గజపతిరాజు తన కుటుంబం మొత్తాన్ని ఏకం చేసి సంచయితను ఆ పదవి నుంచి తప్పించేందుకు రంగంలోకి దిగారు. ఈమేరకు హై కోర్టులో కుటుంబ సభ్యుల చేత వేర్వేరు కేసులు వేశారు. సంచయిత మాత్రమే ఒక వైపు ఉంటే మొత్తం గజపతుల కుటుంబ సభ్యులంతా మరోవైపు నిలబడ్డారు.

మాన్సాస్ ట్రస్ట్ కి ఛైర్ పర్సన్ గా సంచయితను నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ కేసును కోర్టు ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది. మరో వైపు సింహాచలం ట్రస్ట్ ఛైర్మన్ గా సంచయిత గజపతిరాజును నియమించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు చెల్లెలు సునీత ప్రసాద్ చేత మరో పిటిషన్ వేయించారు. ఈ కేసును కూడా హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇటు తను, అటు తన సోదరితో కలిసి అశోక్ గజపతిరాజు సంచయిత నియామకాలకు వ్యతిరేకంగా కేసులు వేశారు. 

కానీ సంచయిత గజపతి కూడా ఎక్కడా భయపడటం లేదు. సంచయిత గజపతిరాజు ఇప్పుడు న్యాయ పోరాటానికి కూడా ఒంటరిగా సిద్ధపడుతున్నారు. బాధ్యతలు తీసుకున్న కొద్దిరోజుల్లోనే ఆమెను అశోక్ గజపతిరాజు టార్గెట్ చేశారు. అయితే అన్నింటికీ సిద్ధపడే తాను ఈ బాధ్యతలు తీసుకున్నానని సంచయిత అప్పుడే తెలిపారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. మరి ఈ న్యాయ పోరాటంలో ఒంటరిగా పోరాడుతున్న సంచయిత విజయం సాధిస్తుందా లేక ఏకమైన అశోక్ గజపతిరాజు కుటుంబం విజయం సాధిస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.