TDP లో ఎంపీ అభ్యర్థుల కొరత

0
64
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఆ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థి టీడీపీకి దొరకడం లేదట. దీంతో బరిలో ఎవరిని దింపాలన్న దానిపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతున్నారట. ఎందుకంటే… ఎంపీ టిక్కెట్ సామాజకింగా, ఆర్థికంగా బలమైన వ్యక్తికి ఇవ్వకపోతే… దాని ప్రభావం అసెంబ్లీ సీట్లపై పడుతుందనేది చంద్రబాబు ఆలోచన. దీంతో ఎంపీ టిక్కెట్ ఇస్తాం రమ్మంటూ బడా పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు కబురు పంపుతున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆదాల ప్రభాకర్ రెడ్డికే ఈసారి ఎంపీ టిక్కెట్ ఖాయమన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆయన పార్టీ నేతలతో సమావేశాలు పెట్టారు. అయితే ఆయన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే చంద్రబాబు పరిమితం చేయడంతో… ఇప్పుడు నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్తను ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని చంద్రబాబు భావించారు. ఆయనకు రాయబారం కూడా పంపారు. అయితే ఏపీలో టీడీపీ పరిస్తితి మీద సొంతంగా సర్వే చేయించుకున్న ఆయన… ఇప్పుడు పోటీ చేయనని చంద్రబాబుకు స్పష్టంగా చెప్పేశారట.
 
అయితే ఉదయగిరి, ఆత్మకూరులో ఏదో ఒక సీటు ఇవ్వాలని కోరిన డీసీసీడీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి… నెల్లూరు ఎంపీ టిక్కెట్ మీద ఆశపెట్టుకున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పారట. అయితే తర్వాత చూద్దామంటూ చంద్రబాబు చెప్పడంతో ఇప్పుడు ఆయన కూడా ఎంపీ టిక్కెట్ రేసు నుంచి బయటకు వచ్చారని జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు. ఇక కోవూరు టిక్కెట్ ఆశించి భంగపడిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, వైసీపీ నుంచి జడ్పీ చైర్మన్ పదవి పొంది, ఆ తర్వాత టీడీపీలో చేరిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా నెల్లూరు ఎంపీ టిక్కెట్ కావాలని పార్టీ నేతలతో చంద్రబాబుకు రాయబారం పంపారు. అయితే వారికి కూడా క్లారిటీ ఇవ్వలేదట టీడీపీ అధినేత. అసెంబ్లీ సీటు ఆశించి, భంగపడ్డ వారు ఎంపీ టిక్కెట్ అడగడమే చంద్రబాబు తాత్సారానికి కారణంగా చెబుతున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే…
 
 
అసెంబ్లీ సీటులోనే బలమైన పోటీ ఎదుర్కొంటున్న వీరు… ఎంపీ సీటు ఎలా గెలుస్తారనేది చంద్రబాబు అనుమానం. ఇటు ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరన్న దానిపై టీడీపీలో క్లారిటీ లేదు. ఎందుకంటే… గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాగుంట శ్రీనివాసులరెడ్డి… ఈసారి తాను పోటీ చేయనని తేల్చి చెప్పేశారట. తాజా పరిస్తితులు, వైసీపీకి పెరిగిన బలం, సొంతంగా చేయించుకున్న సర్వే రిపోర్ట్ ఆధారంగా పోటీకి మాగుంట దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు… టీడీపీ నేత బీదా మస్తాన్ రావును ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎంపీ టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్న దానిపై టీడీపీలో గందరగోళం నెలకొనడం… కార్యకర్తలో నిరాశ నింపుతోంది.