ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

 

గతేడాది భారత సైన్యం వస్తున్న వాహనంపై బాంబు దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు ఉగ్రవాదులు. అయితే ఇప్పుడు మరో సారి అలాంటి దాడికి ప్రయత్నించారు. అయితే భారత సైన్యం దీనిని వెంటనే పసిగట్టి ఆ దాడి నుంచి తప్పించుకునేలా చేసింది. చివరి నిమిషంలో పేలడానికి సిద్దంగా ఉన్న కారు బాంబుని భద్రతా దళాలు గుర్తించాయి.

దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాల సంయుక్త బృందం రాత్రిపూట జరిపిన ఆపరేషన్‌లో 60 కిలోల పేలుడు పదార్థాలతో నిండిన కారును గుర్తించారు. కారు బాంబుని నిర్వీర్వం చేయడం ప్రమాదకరమని భావించిన భద్రతా దళాలు వెంటనే దానిని నివాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లి పేల్చేశారు.

 అయితే ఈ ప్రమాదం జరిగి ఉంటే చాలా మంది జవాన్లు చనిపోయి ఉండేవారని కాశ్మీర్ పోలీస్ అధికారి రాయిస్ మహ్మద్ భట్ చెప్పారు. దాంతో పాటు కారుని దూరంగా తీసుకువెళ్ళి పేల్చేసిన వీడియోని కూడా ట్వీట్ చేశారు.  జైష్-ఇ-మొహమ్మద్ టెర్రర్ గ్రూపుకు చెందిన వారి కుట్ర అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.