
చెట్టు కనబడితే ఎవరికైనా ఏమనిపిస్తుంది... నీరు పొయ్యాలనిస్తుంది... పువ్వులు ఉంటే కొయ్యాలనిపిస్తుంది. కానీ దానికి తల వేసి బాదుకోవాలనిపిస్తుందా.. రక్తం వచ్చేదాకా కొట్టుకోవాలనిపిస్తుందా... అదేం ప్రశ్న అనుకుంటున్నారా.. అలా ఎవరైనా చేస్తారా అనుకుంటున్నారా.. చేస్తారు... అలా చేసే మనిషి ఒకరు ఉన్నారు.
అసలు కథలోకి వెళ్తే... దక్షిణ కొరియాలోని సియోల్లో నివసిస్తున్న చెప్పులు కుట్టే ఓ వ్యక్తి ఇటీవల బాగా ఫేమస్ అయ్యాడు. అతడిని ఎవరూ పేరుతో పిలవరు. కేవలం చెట్టును కొట్టుకొనే వ్యక్తే అని అంటారు. అందుకే, అక్కడ మీడియా కూడా ఆ వ్యక్తిని అలాగే పిలుస్తోంది. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో అతడు చేస్తున్న పని గురించి ప్రపంచమంతా తెలిసింది.
అతడు రోజూ తన చెప్పుల దుకాణం తెరిచే ముందు మార్గ మధ్యలో ఉన్న చెట్టుకు తలను బాదుకుంటాడు. తన శరీరంతో కూడా చెట్టును ఢీకొడతాడు. అయితే, అతడు ఎందుకలా చేస్తున్నాడనేది ఎవరికీ అర్థం కాలేదు. గత ఐదేళ్లుగా అతడు.. అదే పనిగా చెట్టుకేసి తలను బాదుకుంటున్నాడు.
ఎందుకంటూ అతన్ని కారణం అడగగా... ఒకప్పుడు తను బాగా వ్యాయామం చేసేవాడినని, ఇప్పుడు కుటుంబ భాద్యతలతో అసలు కుదరట్లేదని, తనకిష్టమైన బాక్సింగ్ ను మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటున్నానని.. దానికోసమే తన శరీరాన్ని ఈ విధంగా సిద్ధం చేస్తున్నానని ఆ వ్యక్తి తెలియజేశారు.