లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారిపై గూగుల్‌ చర్యలు..!!

0
252
sundar pichai sent off 48 employees over sexual harassment

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న 48 మంది తమ ఉద్యోగులను గత రెండేళ్ల కాలంలో తొలగించినట్లు దిగ్గజ సెర్చింజిన్‌ సంస్థ గూగుల్‌ వెల్లడించింది. వీరిలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నట్లు సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ముగ్గురు సీనియర్‌ అధికారులపై గూగుల్‌ సంస్థ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందనగా గత రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 48 మంది ఉద్యోగులను తాము తొలగించినట్లు సుందర్‌ పిచయ్‌ తన ఉద్యోగులకు ఓ ఈ-మెయిల్‌లో తెలిపారు. వీరిలో 13 మంది సీనియర్‌ మేనేజర్‌ స్థాయి అధికారులు కూడా ఉన్నట్లు అందులో ఉంది.

ఈ ఈ-మెయిల్‌ కాపీపై గూగుల్‌ ఉపాధ్యక్షుడి సంతకం కూడా ఉంది. సంస్థలో సహచరుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు.. అంతర్గతంగా ఏర్పాటు చేసిన వ్యవస్థకు ఫిర్యాదు చేయవచ్చని లేఖలో ఉంది. ఫిర్యాదుదారుల పేర్లు అజ్ఞాతంగా ఉంచుతామని పేర్కొన్నారు. సహచర ఉద్యోగి వల్ల కలిగే ఇబ్బందిని సీనియర్‌ ఉపాధ్యక్ష స్థాయి పదవిలో ఉన్న అధికారులతో సైతం చర్చించే విధంగా తాము వ్యవస్థను మార్చినట్లు గూగుల్‌ తెలిపింది. ‘‘గూగుల్‌లో పనిచేసేవారు చక్కని పని వాతావరణం అనుభవించాలి. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని ఈ-మెయిల్‌లో సుందర్‌ పిచయ్‌ పేర్కొన్నారు.