టీడీపీ ఎమ్మెల్యే చేరికకు అడ్డంపడ్డ మంత్రి

టీడీపీ ఎమ్మెల్యే చేరికకు అడ్డంపడ్డ మంత్రి

 

మహానాడు వేళ‌ టీడీపీకి షాక్ ఇద్దామనుకున్న జగన్ ప్లాన్ కి తాత్కాలికంగా బ్రేక్ పడేటట్టు కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ నేతలు సుముఖంగా లేరు. సీఎం జగన్, కొందరు మంత్రులు అంగీకరించినా స్థానిక నేతల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. 

గుంటూరు జిల్లాకు చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్ పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు, ఒప్పందాలు కూడా కుదిరిపోయాయి. జగన్ ని కలిసి టీడీపీకి రాజీనామా చేయడం ఒక్కటే మిగిలింది. 

ఇలాంటి తరుణంలో జగన్ క్యాబినెట్ లోని ఓ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే చేరికకు అడ్డం తిరిగారు. ఆ మంత్రి ఎవరో కాదు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. మంత్రి మోపిదేవి వెంకటరమణ అడ్డం తిరగడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. మంత్రి మోపిదేవి వెంకటరమణ కి చెందిన రేపల్లె నియోజకవర్గానికే అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే. సత్యప్రసాద్ చేతిలోనే వరుసగా రెండుసార్లు మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. అయినా సరే తొలి నుండి జగన్ వెంట కష్టాల్లో కూడా నడిచి, జైలుకి కూడా వెళ్లిన నేపథ్యంలో మోపిదేవికి జగన్ మంత్రి పదవిని ఇచ్చారు. 

ఓడిపోయినా మంత్రి పదవిని ఇచ్చారు. అంతే కాదు శాసనమండలి రద్దవుతున్న నేపథ్యంలో త్వరలో మోపిదేవిని రాజ్యసభకు కూడా జగన్ పంపనున్నారు. అయితే రాజ్యసభకు పంపుతున్న తరుణంలో తన నియోజకవర్గానికే చెందిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల మంత్రి మోపిదేవి అభ్యంతరం తెలుపుతున్నారు. ఇలా అయితే భవిష్యత్ లో నియోజకవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులొస్తాయని మంత్రి మోపిదేవి వాదన.

ఈ విషయం స్వయంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ సీఎం జగన్ కే వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ ని పార్టీలో చేర్చుకోవడం తనకు ఇష్టం లేద‌ని చెప్పారు. దాంతో మంత్రి మోపిదేవితో చర్చలు జరిపే బాధ్యతను సీఎం జగన్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డి కూడా మంత్రి మోపిదేవి వాదనను పూర్తిగా విన్నారు. వైవీ సుబ్బారెడ్డి వద్ద కూడా మంత్రి మోపిదేవి బలంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. మోపిదేవి అంగీకారం తెలపకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ చేరికకు బ్రేక్ పడింది. 

పక్క జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏకంగా ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేను చేర్చేందుకు ఉత్సాహం చూపించడాన్ని మంత్రి మోపిదేవి తప్పుపడుతున్నారు. తనతో సంప్రదించకుండా, కనీసం మాటైనా చెప్పకుండా టీడీపీ ఎమ్మెల్యేని చేర్చుకుంటే రేపల్లె నియోజకవర్గంలో ఇబ్బందిగా ఉంటుందని మోపిదేవి పార్టీ అధిష్టానానికి వివరించారు. 

దీంతో మహానాడు జరుగుతున్న వేళ‌ టీడీపీ ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని భావించినా దానికి బ్రేక్ పడినట్టయ్యింది. మంత్రి మోపిదేవి అభ్యంతరాన్ని సీఎం జగన్ పరిగణలోకి తీసుకుంటారా..? లేక పార్టీ నిర్ణయం మేరకు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్ ని చేర్చుకుంటారా..? అన్నది త్వరలో తేలిపోనుంది.